ఏప్రిల్ నెలకు వేతనాలు, ఆసరా పింఛన్లు, నిర్వహణ వ్యయం, కరోనా నేపథ్యంలో వైద్యంపై ప్రత్యేక వ్యయం సహా కీలక అంశాలకు నిధులను సమకూర్చుకోవడంపై ఆర్థికశాఖ దృష్టి సారించింది. లాక్‌డౌన్ ప్రభావంతో ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. ఈ పరిస్థితులు ఇంకెంత కాలం కొనసాగుతాయో అనే సందిగ్ధం కొనసాగుతోంది. ఏప్రిల్ నెలలో ముందుకెలా వెళ్లాలనే అంశంపై యోచిస్తోంది. ప్రస్తుత నెలలో జీఎస్టీ, అమ్మకం పన్ను, రిజిస్ట్రేషన్ల రాబడి దాదాపు లేనట్లుగానే భావించాల్సి ఉంటుందని ఆ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
రూ.10 వేల కోట్లకు పైగా..
కరోనా పరిస్థితులు ఏప్రిల్ నెలాఖరులోపు సర్దుకున్నా రాష్ట్ర రాబడిపై మే వరకూ కూడా ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. వేతనాలు, పింఛన్లు, ఆసరా, సహా కీలక అంశాలకు కనీసం రూ.10 వేల కోట్లకు పైగా అవసరమవుతాయని పేర్కొంటున్నారు. కేంద్ర పన్నులు వాటా, రుణాలు సహా ఇతర అంశాల ద్వారా నిధులను సమీకరించుకోవడంపై ఆర్థికశాఖ దృష్టి సారించింది.
రాష్ట్రంపై ఆర్థిక మాంద్యం ప్రభావం..
రాష్ట్రంపై ఆర్థిక మాంద్యం ప్రభావం ఉన్నా సొంత రాబడులతో పాటు అదనపు ఆదాయం అంచనాలతో రూ.1.82 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించింది. అమ్మకం పన్ను, జీఎస్టీతో పాటు రాష్ట్రంలో స్థిరాస్తి రంగంలో ఉన్న వృద్ధిరేటు నేపథ్యంలో ప్రభుత్వం గతేడాది కంటే పన్ను రాబడులను 20 శాతం ఎక్కువగా అంచనా వేసింది. పన్నేతర రాబడులను 150 శాతం ఎక్కువగా సమకూర్చుకునేలా ప్రతిపాదించింది. స్టాంపులు రిజిస్ట్రేషన్ల రాబడిని గత కంటే 55 శాతం పెంచింది.
ఏప్రిల్‌పై ఆశల్లేవు..
మార్చి నెల ఆర్థిక సంవత్సరంలో చివరి నెల కావడంతో పన్ను తాజా వసూళ్లతో పాటు బకాయిలు వసూళ్లపై ప్రభుత్వ శాఖలు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయడంతో మార్చిలో లక్ష్యం మేరకు కాకున్నా 90 శాతం పైగా అంచనాలను అందుకున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో నిధుల సర్దుబాటు ఎలా అనే అంశంపై ఆర్థికశాఖ తర్జనభర్జన పడుతోంది. సగటున వాణిజ్య పన్నులశాఖ ద్వారా సగటున రూ.5 వేల కోట్ల నుంచి రూ.6 వేల కోట్ల రాబడి అంచనాగా ఉంది. ఏప్రిల్‌లో జీఎస్టీ రాబడులే కాకుండా పెట్రోలియం ఉత్పత్తులై నామమాత్రంగా, మద్యం ద్వారా వచ్చే రాబడి దాదాపు లేనట్లేనని అభిప్రాయపడుతున్నారు.
రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా..
స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా నెలకు రూ.800 కోట్లకు పైగా రాబడి వచ్చే అవకాశం ఉండగా లాక్‌డౌన్ వల్ల రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిచిపోయాయి. సాధారణంగా సగటున రోజుకు రాష్ట్రంలో 4 వేల నుంచి 6 వేల దాకా రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ఈ శాఖ ద్వారా ఏప్రిల్‌లో మొదటి నాలుగు రోజులు 533 రిజిస్ట్రేషన్లు మాత్రం జరగ్గా రాబడి కోటి రూపాయలలోపే ఉండటం గమనార్హం. రవాణాశాఖ ద్వారా నెలకు రూ.300 కోట్ల రాబడి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది.
ఇవీ చూడండి: 'ముస్లిం సమాజమంతా ప్రభుత్వానికి చేయూతనివ్వాలి'