Dharani problems: ధరణి పోర్టల్ అమల్లో ఉత్పన్నమవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత కొన్నాళ్లుగా కసరత్తు చేస్తోంది. వివిధ మాడ్యూల్స్‌ను ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చారు. వాటి ద్వారా వచ్చిన దరఖాస్తుల పరిష్కారం కోసం ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఇంకా కొన్ని సమస్యలు రైతులకు ఇబ్బందికరంగా మారాయి. ప్రత్యేకించి పేర్లలో తప్పులు, విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, సర్వే నంబర్లలో పార్టుల సంబంధిత అంశాలు సమస్యలుగా మారాయి.
కొత్త మాడ్యూల్స్‌తో సమస్యలు పరిష్కారం..!
ధరణి సమస్యల పరిష్కారంపై ఆర్థిక మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం... ఇందుకు సంబంధించిన అంశాలపై కసరత్తు చేసింది. పలు సమస్యల పరిష్కారం దిశగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించింది. పేర్లలో తప్పులు, విస్తీర్ణం హెచ్చుతగ్గులు, సర్వే నెంబర్లకు సంబంధించిన మాడ్యూల్స్ విషయమై గత సమావేశాల్లో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వాటికి అవసరమైన మాడ్యూల్స్ రూపొందించాలని చెప్పారు. అవన్నీ అందుబాటులోకి వస్తే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయని అంచనా వేస్తున్నారు.
హెల్ప్‌డెస్క్‌లతో అవగాహన..
ఇదే సమయంలో మాడ్యూల్స్‌పై విస్తృత అవగాహన కల్పించాలని కూడా మంత్రివర్గ ఉపసంఘం సూచించింది. సరైన అవగాహన లేనందున సమస్యలు పరిష్కారం కావడం లేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో ధరణి మీ సేవ ఆపరేటర్లకు జిల్లా స్థాయిలో శిక్షణ ఇవ్వాలని... జిల్లా పరిషత్, మున్సిపల్ సమావేశాలకు జిల్లా కలెక్టర్లు హాజరై ధరణి గురించి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించాలని మంత్రులు తెలిపారు. అన్ని జిల్లా కలెక్టరేట్‌లలో ధరణి హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయాలని... అవగాహన కల్పించడంతో పాటు దరఖాస్తులను అప్‌లోడ్ చేసే వెసులుబాటు ఉండాలని అన్నారు. ఆయా సమస్యలకు అనుగుణంగా టెక్నికల్ మాడ్యూల్స్‌ను రూపొందించాలన్న మంత్రివర్గ ఉపసంఘం ఆదేశాల మేరకు రెవెన్యూ, స్టాంపులు - రిజిస్ట్రేషన్ల శాఖలు, టీఎస్ టెక్నాలజీస్ సర్వీసెస్ కసరత్తు చేశాయి. గుర్తించిన సమస్యల పరిష్కారం కోసం అనువైన మాడ్యూల్స్‌ను సిద్ధం చేశాయి.
సమస్యలపై సీఎం కేసీఆర్ ఆరా..
మాడ్యూల్స్, అవగాహన సహా కార్యాచరణ అంశాలపై సిఫారసులను మంత్రివర్గ ఉపసంఘం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందించింది. వాటిపై మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చర్చించారు. ఉన్న సమస్యలు, వాటి పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సుధీర్ఘంగా సమీక్షించినట్లు తెలిసింది. ఏడాది గడిచి పోయినప్పటికీ అన్ని అంశాలు ఇంకా ఎందుకు కొలిక్కి రావడం లేదని ముఖ్యమంత్రి ప్రశ్నించినట్లు సమాచారం. సమస్యలన్నింటికీ పరిష్కారం ఎప్పుడు లభిస్తుందని అడిగినట్లు తెలిసింది. వీలైనంత త్వరగా అన్ని అంశాలను ఓ కొలిక్కి తీసుకొచ్చి ధరణి కార్యకలాపాలన్నీ పూర్తి స్థాయిలో సాఫీగా సాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.
మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులపై మరోసారి అధికారులతో చర్చించిన అనంతరం సీఎం కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వాటికి అనుగుణంగా మాడ్యూల్స్ అందుబాటులోకి రానున్నాయి. ఈ పక్రియ పూర్తయితే ధరణి సమస్యలన్నీ దాదాపుగా పరిష్కారం అవుతాయని ప్రభుత్వ వర్గాలు అకాంక్షిస్తున్నాయి.
ఇదీ చూడండి: