Father died while doing son's funerals: అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు.. తన కళ్ల ముందే మరణించడాన్ని తట్టుకోలేకపోయారు ఆ తండ్రి. తన కుమారుడి బంగారు భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడ్డారు. చదువు పూర్తి చేశాడు.. రేపోమాపో ఉద్యోగం వస్తుంది.. పెళ్లి చేసేయాలి.. మనవడో, మనవరాలో పుడితే వాళ్లను ఆడిస్తూ జీవితం గడిపేయాలి.. ఇలా ఎన్నో కలలుగన్నారు ఆ తండ్రి. కానీ అనుకోకుండా ఎదురైన కన్నకొడుకు మరణం ఆ తండ్రిని కుంగదీసింది. తనకు చితి పేర్చాల్సిన కుమారుడికి తానే తలకొరివి పెట్టడాన్ని తట్టుకోలేకపోయారు. కుమారుడికి అంత్యక్రియలు చేస్తూనే గుండెపోటుతో కుప్పకూలిపోయారు. కన్నా.. నేనూ నీ వెనకే వస్తున్నా అంటూ తిరిగిరాని లోకాలకు తరలిపోయారు. ఈ విషాద ఘటన ఏపీలో విశాఖ నగరంలోని మల్కాపురంలో చోటు చేసుకుంది.
అనారోగ్యం రూపంలో మృత్యువు
యారాడకు చెందిన బాయిన అప్పారావు కుటుంబం బతుకుదెరువు కోసం మల్కాపురం వచ్చి జీవిస్తోంది. ఈయన కుమారుడు గిరీష్ (22) ఏవియేషన్ కోర్సు పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. అనారోగ్యం బారినపడటంతో శుక్రవారం గిరీష్ మృతి చెందాడు. స్థానిక గుల్లలపాలెం శ్మశానవాటికలో శనివారం అంత్యక్రియలు జరిపారు. గిరీష్ చితిచుట్టూ తిరుగుతూ ఆయన తండ్రి అప్పారావు(50) ఒక్కసారిగా కుప్పకూలిపోయి మరణించారు. అయిదేళ్ల కిందటే అప్పారావుకు గుండె సంబంధిత సమస్య రావడంతో స్టంట్స్ వేశారు. కుమారుడి మరణంతో షాక్‌కు గురై ఆయనా చనిపోయారు. అప్పారావుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒక కుమార్తెకు వివాహమైంది. భర్తను, కుమారుడిని ఒకేసారి పోగొట్టుకున్న ఆ భార్య, కుమార్తెలతో కలిసి గుండెలవిసేలా రోదిస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది.
ఇదీ చదవండి: అనుమతులు లేకున్నా రిజిస్ట్రేషన్లు.. అధికారుల అక్రమాలు!