Facebook love: ఎవరో ఏంటో తెలియకుండానే.. ఓ అబ్బాయితో ఫేస్‌బుక్ వేదికగా ప్రేమలో పడింది ఓ అమ్మాయి. కనీసం ముఖాలు కూడా చూసుకోకుండానే ఏడాది పాటు ఇద్దరూ ప్రేమించుకున్నారు. వీరి ప్రేమకు అమ్మాయి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో.. యువకుడు డ్రాప్ అయిపోదామనుకున్నాడు. కానీ.. యువతి మాత్రం ప్రియుడి దగ్గరకు వెళ్లి పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. కుదరదని యువకుడు తెగేసి చెప్పడంతో.. న్యాయం చేయాలంటూ ఏపీలోని అనంతపురం సఖి కేంద్రంలో తిష్ఠ వేసింది.
వివాహం చేసే వరకు కదిలేదేలే..
గుంతకల్లుకు చెందిన రైల్వే విశ్రాంత ఉద్యోగి కుమార్తె.. ఒంగోలుకు చెందిన అబ్బాయి.. ఏడాది క్రితం ఫేస్‌బుక్ ద్వారా పరిచయమయ్యారు. వారి స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఒకరినొకరు చూసుకోకుండానే ఏడడుగుల బంధంతో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. యువతి తల్లిదండ్రులు ఈ పెళ్లికి ససేమిరా అన్నారు. యువకుడిని ఫోన్‌లో తిట్టి.. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ ఘటన తర్వాత యువతితో అబ్బాయి మాట్లాడటం మానేశాడు.
ప్రియుడు తనను దూరం పెట్టటం తట్టుకోని అమ్మాయి.. అతడి ఆచూకీ తెలుసుకోవటం ప్రారంభించింది. విజయనగరంలోని ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్నాడని తెలుసుకుని అక్కడికి వెళ్లింది. ఎందుకు ముఖం చాటేస్తున్నావని నిలదీసింది. పెళ్లికి పెద్దలు అంగీకారం లేనందున... కలవడం కుదరదని యువకుడు తెగేసి చెప్పేశాడు. ప్రియుడు కరాఖండిగా చెప్పటం వల్ల.. చేసేదేమీ లేక అనంతపురానికి తిరిగి వచ్చింది. న్యాయం చేయాలంటూ ఐసీడీఎస్ సఖి కేంద్రంలో తిష్ఠ వేసింది. ప్రియుడితో వివాహం చేసే వరకు కదిలేదేలే అంటోంది.
ఎవరు చెప్పినా వినకపోయేసరికి ...
యువతి ప్రేమాయణం తెలుసుకున్న సఖి కేంద్రంలోని సిబ్బంది ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎంత నచ్చజెప్పినా.. యువతి వినకపోవడంతో దిశా పోలీసులకు సమాచారమిచ్చారు. సఖి కేంద్రంలో భవనంపై ఎక్కి దూకేస్తానంటూ బెదిరించి హల్చల్ చేసింది. ఎవరు చెప్పినా వినకపోయేసరికి... ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో అర్థం కాక పోలీసులు సతమతమవుతున్నారు. మరోవైపు తమ కుమార్తె ఎవరిని ప్రేమించిందో తమకు తెలియదని యువతి తల్లిదండ్రులు అంటున్నారు.
ఇదీ చదవండి: