భారీ వర్షాలు పడితే.. ఏపీలోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై నుంచి రాళ్లు జారిపడుతుంటాయి. ఇటీవల నవరాత్రి ఉత్సవాల్లోనూ ఈ తరహా ప్రమాదం జరగ్గా.. తృటిలో ప్రాణనష్టం తప్పింది. కొండరాళ్లు పడకుండా నివారించేందుకు ఏం చేయాలన్నదానిపై.. నిపుణుల బృందం దుర్గగుడిని పరిశీలించింది. దేవదాయశాఖ సాంకేతిక సలహాదారు కొండలరావు ఆధ్వర్యంలో.. ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మాధవ్, బెంగళూరులోని ఇండియన్ అకాడెమీ ఆఫ్ సైన్స్‌కు చెందిన ప్రొఫెసర్ శివకుమార్, భూ భౌతికశాస్త్ర నిపుణులు త్రిమూర్తిరాజుతో కూడిన నలుగురు సభ్యుల బృందం.. ఆలయం చుట్టూ ఉన్న కీలకమైన 600 మీటర్ల కొండను పరిశీలించింది. కొండంతా మట్టి, రాళ్లతో కలిపి ఉన్నందున.. భారీ వర్షం పడ్డప్పుడు.. మట్టి కరిగి రాళ్లు జారి పడుతున్నాయని నిపుణులు అంచనాకొచ్చారు.
మట్టి కరగకుండా ఉండేందుకు.. కొండ పైభాగంలో పడే వర్షపు నీటిని వెనకవైపు నుంచి కిందకు పంపించాలని నిపుణులు సూచించారు. ఇందుకు ఓ కాలువ నిర్మించాలన్నారు. కొండపై ఉన్న ఇనుప వలను పటిష్ఠం చేయాలన్నారు. ప్రభుత్వానికి.. నిపుణుల బృందం నివేదిక సమర్పించాక.. ప్రతిపాదనలు సిద్ధం చేసి టెండర్లు పిలుస్తామని దుర్గగుడి అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: వరదలు ముంచేయకుండా... వ్యూహాత్మక ప్రణాళిక: కేటీఆర్