మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. సర్పంచ్ స్థాయి నుంచి మంత్రి వరకు రాజకీయంగా ఎదిగిన సాంబశివరాజు.. 8 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రిగా పని చేశారు. ఏఐసీసీ కార్యదర్శిగానూ పనిచేసిన సాంబశివరాజు.. శాసనసభలో రెండుసార్లు ప్రొటెమ్ స్పీకర్‌గా సేవలందించారు.
1989-94లో మంత్రిగా పెన్మత్స సాంబశివరాజు బాధ్యతలు చేపట్టారు. 1958లో సమితి ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. 1968లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గజపతినగరం, సతివాడ స్థానాల నుంచి వరుసగా 8 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. సుదీర్ఘ కాలంపాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగి రాజకీయ కురువృద్ధుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఏపీ మంత్రి బొత్సకు రాజకీయ గురువుగా పెన్మత్స సాంబశివరాజు ఉన్నారు.