ప్రభుత్వంలో లోపాలను ఎత్తి చూపినందుకు తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని జైళ్ల శాఖ మాజీ డీజీ వీకే సింగ్ ఆరోపించారు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయిందని... అవినీతి వేళ్లూనుకుపోయిందని అసహనం వ్యక్తం చేశారు. ప్రతిభ ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా వెయిటింగ్లో ఉంచుతున్నారని వీకే సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు పదోన్నతి ఇవ్వకుండా ఆపడమే కాకుండా... పదవీ విరమణ ప్రయోజనాలు, ఫించన్ కూడా అందించలేదని వీకే తెలిపారు. సీఎం కేసీఆర్తో కానీ... ఏ రాజకీయ పార్టీతో కానీ తనకు శత్రుత్వం లేదని... కేవలం ప్రజల బాగు కోసమే పనిచేస్తానని వీకే సింగ్ తెలిపారు.
స్వామి వివేకానంద, సుభాష్ చంద్రబోస్, భగత్సింగ్లను ఆదర్శంగా తీసుకొని రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కష్టపడతానని తెలిపారు. యువకుల ఆత్మబలిదానాలతో సాకారమైన బంగారు తెలంగాణ... ప్రస్తుతం కంగారు తెలంగాణగా మారిందని వీకే సింగ్ ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఎన్నికల కోసమే పని చేస్తోందని... ప్రజల కోసం కాదని వీకే సింగ్ విమర్శించారు. ప్రభుత్వం చెప్పే మాటలు ప్రజలు నమ్మే స్థితిలో లేవని... రాబోయే నెల రోజుల్లో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వీకే సింగ్ తెలిపారు.