బీమా వైద్య సేవల సంస్థ కుంభకోణంపై దర్యాప్తు జోరందుకోనుంది. అక్రమాల నిగ్గుతేల్చేందుకు ఆదాయపుపన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారించాయి. ఇప్పటికే అనిశా నుంచి అధికారులు పత్రాలు సేకరిస్తున్నారు. నిబంధనలు పట్టించుకోకుండా కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు విచారణలో బయటపడగా.. మొత్తం వ్యవహారంలో నిధుల మళ్లింపుపై ఈడీ ఆరా తీస్తోంది.
రూ. 250 కోట్లు - గోల్‌మాల్
నాలుగేళ్లలో సుమారు వెయ్యి కోట్ల నిధులు మంజూరు కాగా... అందులో 250 కోట్ల రూపాయలు అవకతవకలు జరిగినట్టు అనిశా అంచనా వేస్తోంది. అన్ని దస్త్రాలు పరిశీలిస్తే కుంభకోణంలో మరిన్ని అక్రమాలు బయటపడతాయని భావిస్తున్నారు. గోల్‌మాలైన కోట్ల నిధులను ఎటు మళ్లించారో ఈడీ తేల్చనుంది.
ఇంటి దొంగలే అక్రమార్కులు..
బీమా వైద్య సేవల కుంభకోణంతో భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులతోపాటు... ప్రైవేటు వ్యక్తులు అక్రమార్జన ద్వారా సమకూర్చుకున్న ఆస్తుల వివరాలు సేకరించనున్నారు. వాటిని స్వాధీనం చేసుకోవడానికి 'ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్' కింద ఈడీ కేసు నమోదు చేయనుంది. అనిశా దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ను న్యాయస్థానం ద్వారా సేకరించి దాని ఆధారంగా ఈడీ కేసు నమోదు చేయనున్నారు.
అడ్డగోలుగా నొక్కేశారు.. విదేశాలకు చెక్కేశారు..
మరోవైపు అక్రమార్జనతో ఈఎస్‌ఐ అధికారులు అడ్డగోలుగా ఆస్తులు సమకూర్చుకున్నట్లు, విదేశీ పర్యటనలు చేసినట్లు అనిశా గుర్తించింది. బీమా వైద్య సర్వీసుల కుంభకోణంపై ఈడీ, ఆదాయపన్నుశాఖ దృష్టి సారించడం వల్ల ఈ వ్యవహారంలో మరిన్ని అవకతవకలు బయటపడే అవకాశం ఉంది.