గురువారం నూతనంగా బాధ్యతలు చేపడుతున్న జిల్లా, మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వారందరికి ఓ లేఖ రాశారు. బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే ఆదర్శవంతమైన పరిపాలన కొనసాగిస్తున్నారని... ఆ పథకాలు గ్రామాల్లో అర్హులకు చేర్చడంలో స్థానిక సంస్థల ప్రతినిధులే కీలక పాత్ర పోషించాలని సూచించారు.
ఆదాయం పెంచాలి, పెంచిన ఆదాయాన్ని పేదలకు పంచాలన్న నినాదంతో.. ముఖ్యమంత్రి అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని వివరించారు. మెరుగైన పరిపాలనే లక్ష్యంగా కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని అమల్లోకి తెచ్చారని అన్నారు. గ్రామపంచాయతీలు, మండల ప్రజాపరిషత్, జిల్లా పరిషత్‌ల పునర్విభజనతో పాటు స్థానిక సంస్థలకు ఎన్నో అధికారాలను, బాధ్యతలను అప్పగించారని మంత్రి అన్నారు. పల్లెల వికాసంతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యం అనే స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని లేఖలో పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో బంగారు తెలంగాణ సాధనలో స్థానిక సంస్థల నూతన ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని ఎర్రబెల్లి ఆకాంక్షించారు.