కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన ప్రక్రియలో ఏ ఒక్కరూ సీనియార్టీ నష్టపోకుండా చూడాలని ఉద్యోగసంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయి. పాత ఉద్యోగులకు పాత విధానాన్నే అమలు చేయాలని విజ్ఞప్తి చేశాయి. ఉద్యోగుల విభజన మార్గదర్శకాలపై టీఎన్జీఓలు, టీజీఓలతో అధికారులు సమావేశయ్యారు. సీఎస్ సోమేశ్ కుమార్తో పాటు వివిధ శాఖల కార్యదర్శులు ఉద్యోగసంఘాల నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. జిల్లాల్లో జనాభాకు అనుగుణంగా అదనపు పోస్టులు మంజూరు చేయాలని.. అన్ని శాఖల్లో కార్యాలయాల వారీగా కేడర్ స్ట్రెంత్ ఖరారు చేయాలని కోరారు.
ఉద్యోగుల సీనియార్టీ నష్టపోకుండా చూడాలని... 2018కి ముందు నియామకమైనవారికి పాత విధానానికి అనుగుణంగానే సీనియార్టీని పరిగణలోకి తీసుకోవాలని కోరారు. కొత్తగా నియామకమయ్యే ఉద్యోగులకు మాత్రమే 2018 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జోనల్ విధానాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. జోనల్, మల్టీజోనల్ కేడర్లలో నియామకాలు చేసినప్పటికీ... మల్టీజోనల్, రాష్ట్ర స్థాయిలో పనిచేసే అవకాశం కల్పించాలని టీజీఓలు కోరారు. పీఆర్సీ వ్యత్యాసాలపై కమిటీ ఏర్పాటు చేయాలని, ఒక శాతం చందాతో ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని, పదోన్నతుల కనీస సర్వీసును రెండేళ్లకు కుదిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు టీఎన్జీఓ, టీజీఓ అధ్యక్షులు రాజేందర్, మమత తెలిపారు. ఉద్యోగులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తామని... అవసరమైన మేరకు నిర్ణయాలు తీసుకొని త్వరలోనే అమలు చేస్తామని సీఎస్ హామీ ఇచ్చినట్లు నేతలు తెలిపారు.
ఇదీ చూడండి: