Employees Postings: కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన, కేటాయింపు ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. స్థానికతకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఓ వైపు సంఘాలు, పార్టీలు ఆక్షేపించడంతో పాటు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. మరోవైపు ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. జిల్లా కేడర్ పోస్టులకు సంబంధించిన ప్రక్రియ దాదాపుగా పూర్తయ్యిందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఉపాధ్యాయులకు సంబంధించి కూడా కొన్ని చోట్ల తప్పితే అంతటా పూర్తయ్యిందని అంటున్నారు.
జిల్లా స్థాయిలోని రెండున్నర లక్షల ఉద్యోగులకు గాను.. దాదాపు 38 వేల మంది కొత్త ప్రాంతాలకు వెళ్లినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అప్పీళ్లు, భార్యాభర్తల కేసులు సహా ప్రత్యేక కేటగిరీలు సహా అన్నింటినీ పరిశీలించాకే ఖాళీలకు అనుగుణంగా పోస్టింగులు ఇచ్చినట్లు చెప్తున్నారు. అటు జోనల్, మల్టీ జోనల్ కేడర్ పోస్టులకు సంబంధించి కూడా ప్రక్రియ వేగవంతం చేశారు. కేటాయింపులతో అప్పీళ్ల పరిష్కారం దాదాపుగా పూర్తయ్యిందని అంటున్నారు. ఈ దశలో మరో తొమ్మిది వేల మంది వరకు ఉద్యోగులు కొత్త ప్రాంతాలకు వెళ్లినట్లు సమాచారం. వారికి పోస్టింగులు ఇచ్చేందుకు ఆయా శాఖలు సంబంధిత అధికారులతో కమిటీలను ఏర్పాటు చేశాయి.
ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న వైద్య-ఆరోగ్య తదితర శాఖల్లో జోన్ల వారిగా ప్రత్యేకాధికారులను నియమించారు. ఈ నెల ఏడో తేదీ వరకు పోస్టింగుల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులకు గడువు నిర్దేశించారు. కొత్త జోనల్ విధానంలో భాగంగా రాష్ట్ర స్థాయి పోస్టులున్న డీఎస్పీ, ఆర్డీఓ, తదితర కీలక పోస్టులను రాష్ట్ర స్థాయి నుంచి మల్టీజోనల్ స్థాయికి మార్చారు. ఈ కేడర్ పోస్టింగుల విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని అన్ని శాఖల కార్యదర్శులకు సీఎస్ సూచించారు. పోస్టింగుల ప్రక్రియ వేగవంతం చేయాలని... రెండు, మూడు రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యాక పరస్పర బదిలీల అంశంపై సర్కార్ దృష్టి సారించే అవకాశం ఉంది.
ఇదీ చూడండి: