ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో వింత వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. అనూహ్యంగా పెరుగుతున్న బాధితులతో ఏలూరు జిల్లా ఆస్పత్రి పడకలు నిండుతున్నాయి. దీంతో బాధితుల ఆరోగ్య లక్షణాలను అనుసరించి కొందరిని సమీపంలోని ఆశ్రం వైద్యకళాశాలకు తరలిస్తున్నారు. ఆస్పత్రిలో చేరినవారు ఓ పక్క కోలుకుంటుంటే.. మరోపక్క కొత్త బాధితులు ఆస్పత్రికి బారులు తీరుతున్నారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి పొద్దుపోయేవరకూ 147 మంది చేరారు.
వీరితో 3 రోజుల్లో ఆస్పత్రిలో చేరినవారి సంఖ్య 464కు చేరింది. 17 మందిని విజయవాడ, గుంటూరు ఆస్పత్రులకు తరలించారు. మూడురోజుల్లో కలిపి 263 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉండటం, వ్యాధికి కారణాలు తెలియకపోవటం, ఆదివారం రాత్రి ఒక వ్యక్తి ఈ లక్షణాలతో మరణించడంతో ఏలూరులో ప్రజలు బిక్కుబిక్కుమని కాలం గడుపుతున్నారు.
పలువురికి మళ్లీ లక్షణాలు:
ఆస్పత్రిలో చేరినవారిలో పలువురు బాధితులు లక్షణాలు తగ్గాయని ఇళ్లకు వెళ్లారు. వారిలో కొందరు తిరిగి అదే లక్షణాలతో ఆస్పత్రికి రావడం ఆందోళన కలిగిస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ముగ్గురు, నలుగురు ఇలా అస్పత్రికి తిరిగివచ్చారు. కోలుకుని ఇంటికెళ్లిన వారిలో కొందరు మళ్లీ ఇంటిలో మూర్ఛ వచ్చి పడిపోతున్నారు.
మారుతున్న లక్షణాలు:
శని, ఆదివారాల్లో ఎక్కువ మందిలో వాంతులు, నోటిలో నుంచి నురగ వంటివి రాలేదు. సోమవారం అధిక శాతం బాధితులు వాంతులు, విరేచనాలు, నురగలు కక్కటం, మూర్ఛ తదితర లక్షణాలతో బాధపడ్డారు. మూర్ఛతో పడిపోయినప్పుడు, ఫిట్స్‌తో కొట్టుకుంటున్నప్పుడు పలువురికి నోటి వెంట రక్తం వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో అంబులెన్సులు సకాలంలో రాకపోవటంతో ప్రైవేటు వాహనాల్లో ఆస్పత్రికి చేరుతున్నారు. బాధితులకు ఆస్పత్రిలో సెలైన్ పెట్టి ఇంజెక్షన్లు ఇస్తున్నారు. తర్వాత బాధితులకు తలనొప్పి, నడుంనొప్పి, తల తిరగటం, గ్యాస్ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఆ సమయంలో తమకు ఎలాంటి వైద్యసేవలు అందటం లేదని కొందరు రోగులు చెబుతున్నారు. జిల్లా వైద్యశాలలోనే కాక ఏలూరులో ఇతర ప్రైవేటు, కార్పొరేటు, ఆర్‌ఎంపీ వైద్యశాలల్లో కొందరు చికిత్స పొందుతున్నారు. నీటి కాలుష్యం వల్లనే ఇదంతా జరుగుతోందన్న చర్చ ప్రజల్లో విస్తృతంగా జరుగుతోంది.
ఆరోగ్య సిబ్బందినీ వదల్లేదు
వ్యాధి ఆరోగ్య సిబ్బందినీ వదల్లేదు:
ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో సోమవారం విధులు నిర్వహిస్తున్న నర్సు రంజిని రోగులకు సేవలందిస్తున్న తరుణంలోనే ఫిట్స్ రావడంతో ఒక్కసారిగా పడిపోయారు. ఈ ఘటనతో వైద్య సిబ్బందిలోనూ ఆందోళన మొదలైంది. సీఎం పర్యటన బందోబస్తు విధులు నిర్వహిస్తూ త్రీటౌన్ కానిస్టేబుల్ కిరణ్ అస్వస్థతకు గురయ్యారు. కళ్లు తిరుగుతున్నాయని చెప్పడంతో అతణ్ని వెంటనే అంబులెన్సులో ప్ర£భుత్వాసుపత్రికి తరలించారు. వైద్యసేవలు అందించడంతో ఆయన వెంటనే కోలుకున్నారు.
ఇద్దరు మహిళలకు ఆగని ఫిట్స్:
గుంటూరు సర్వజనాసుపత్రికి వచ్చిన ఐదుగురిలో ఇద్దరు మహిళలకు ఫిట్స్ వస్తూనే ఉన్నాయి. కుసుమకుమారి, లక్ష్మీకుమారికి రెండు గంటలకు ఒకసారి ఫిట్స్ వస్తున్నాయని గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి తెలిపారు. వీరి అనారోగ్యానికి కారణాలు తెలుసుకునేందుకు నిపుణులైన వైద్యులతో కమిటీని వేసినట్లు తెలిపారు. సీటీ/ ఎమ్మారై స్కానింగ్‌ల్లో వారికి మెదడులో ఎటువంటి సమస్యలు లేవని తేలిందని వైద్యులు తెలిపారు. మిగిలిన ముగ్గురి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందన్నారు. అంతుచిక్కని వ్యాధి బారినపడి పరిస్థితి విషమంగా ఉండటంతో ఏలూరు నుంచి ఆదివారం నలుగురిని, సోమవారం మరో 8 మందిని విజయవాడకు తీసుకొచ్చారు. విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రత్యేక వార్డులో వీరికి చికిత్స చేస్తున్నామని, అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని సూపరింటెండెంట్ కె.శివశంకర్ వెల్లడించారు.
ఇదీ చదవండి : ప్రతి పల్లె ఆ గ్రామంలా కావాలని కేసీఆర్ సూచన