Elephants Roaming: ఏపీలోని చిత్తూరు జిల్లా.. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో నివసించే మూడు ఏనుగులు.. ఈ ఏడాది ఫిబ్రవరిలో యాత్ర ప్రారంభించాయి. పలమనేరు నియోజకవర్గంలోని కౌండిన్య అభయారణ్యం నుంచి ప్రయాణాన్ని ప్రారంభించి బుధవారం నాటికి రేణిగుంట మండలం ఎర్రమరెడ్డిపాళెం చేరుకున్నాయి. ఇవి దాదాపు 200 కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. అభయారణ్యం, అడవులు, గ్రామాలు, నదులను దాటి వచ్చిన ఈ కరి సమూహం తదుపరి ప్రయాణం ఎటో తెలియడం లేదు. శేషాచలం అభయారణ్యం వైపు వెళతాయా? లేదంటే తిరిగి కౌండిన్యకు చేరుకుంటాయా? అనే ఆసక్తి నెలకొంది.
ప్రారంభించింది ఒక్క ఏనుగే..
సాధారణంగా ఏనుగులు ఆహారం, నీరు, ఆవాసం కోసం కొత్త ప్రాంతాలను వెతుక్కుంటూ గుంపుగా వెళతాయి. కౌండిన్య అభయారణ్యంలో సరైన వనరులు లేకపోవడంతో గతేడాది ఓ ఏనుగు మరో రెండింటిని కూడగట్టి చెరకు సాగు ఎక్కువగా ఉండే వెదురుకుప్పం, కార్వేటినగరం, పుత్తూరు తదితర తూర్పు ప్రాంతాలకు తీసుకెళ్లింది. వాటిలో ఒకటి దురదృష్టవశాత్తు నారాయణవనం మండలంలో విద్యుదాఘాతంతో మరణించింది.
కొంతకాలం తర్వాత తిరిగి రెండు గజరాజులు వేర్వేరుగా కౌండిన్యకు చేరుకున్నాయి. గతేడాది విహారాన్ని ప్రారంభించిన ఏనుగే.. ఈ ఏడాది మరో రెండింటిని జత చేసుకొని ఐరాల, పూతలపట్టు, పెనుమూరు, వెదురుకుప్పం, కార్వేటినగరం, పుత్తూరు, నగరి వరకు తీసుకెళ్లింది. అటు నుంచి తమిళనాడుకు వెళ్లగా అక్కడి అటవీ శాఖ సిబ్బంది తరమడంతో.. మూడు గజరాజులు దారి తప్పి వడమాలపేట, ఏర్పేడు, శ్రీకాళహస్తి, రేణిగుంట మండలాల్లో తిరుగుతున్నాయి. ఇప్పటివరకూ అవి ఎవరికీ హాని కలిగించకపోవడం ఊరట కలిగిస్తోంది. అన్నదాతలు మాత్రం పంట నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:'కేసీఆర్కు కోపం వస్తుందనే ఉగాది వేడుకలకు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వెళ్లలేదు'