ETV Bharat / city

ఎన్నో ఆధ్యాత్మిక ప్రాశస్త్యాల రాశి.. పర్వదినాలకు ఆరంభం ఈ "ఏకాదశి"..! - Ekadashi Importance

Ekadashi Festival Importance: ఆషాఢ శుద్ధ ఏకాదశి- తొలి ఏకాదశి. హైందవులకు ఇది మహా పర్వదినం. దీన్ని "హరివాసరం" అని.. "శయనైకాదశి" అని పిలుస్తారు. తొలి ఏకాదశి నుంచే సనాతన సంప్రదాయంలో పండుగలు, పర్వదినాల సమాహారం ఆరంభమవుతుంది. ఎన్నో విశేషాల ఆధ్యాత్మిక ప్రక్రియల రాశి- తొలి ఏకాదశి.. మరీ ఆ ఏకాదశి ప్రాశస్త్యమేంటో తెలుసుకుందాం.. రండి..

Ekadashi Festival Importance and Prosperity

author img

By

Published : Jul 10, 2022, 6:05 AM IST

Ekadashi Festival Importance: ప్రకృతిలో సతత హరిత శోభను, నదీనదాల్లో జలకళను, పుష్ప సముదాయంలో కోమలత్వాన్ని, పుడమిలోని ఆవిష్కార లక్షణాన్ని "విష్ణుతేజం"గా ఆగమాలు నిర్దేశించాయి. సకల సృష్టిలో కంటికి కనిపించే సౌందర్యాత్మక సిరి వైభవాన్ని విష్ణువిలాసంగా సనాతన ధర్మం ప్రతిపాదించింది. అలాంటి శ్రీమహావిష్ణువు దివ్య దేహం నుంచి వెలువడిన సత్త్వరూప సమున్నత శక్తి- ఏకాదశి. ఏడాదికి ఇరవైనాలుగు, అధికమాసం వచ్చిన సందర్భంలో ఇరవై ఆరు ఏకాదశులు ఉంటాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశిని ప్రథమ ఏకాదశిగా, మహా ఏకాదశిగా, దివ్య ఏకాదశిగా ప్రస్తావిస్తారు. సంవత్సరాన్ని "వర్షం"గా పేర్కొంటారు. ప్రకృతిలో ఐశ్వర్యకారక శక్తిని పెంపొందింపజేసే వర్ష పరంపరకు ఆహ్వానం పలికే ఆషాఢంలోని శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశిగా ఖ్యాతి గాంచింది.

క్షీరసాగరంలో శేషతల్పంపై శ్రీహరి తొలి ఏకాదశినాడు యోగనిద్రకు సమాయత్తమవుతాడని విష్ణుపురాణం పేర్కొంది. అందుకే ఈ తిథిని హరివాసరంగా, శయనైకాదశిగా చెబుతారు. విశాల విశ్వానికి క్షీరసాగరం సంకేతం. ఆదిశేషుడు అనంతకాల గమనానికి సూచిక. ఆ కాలాన్ని నియంత్రించే కాలస్వరూపుడిగా, కాలాత్మకుడిగా విష్ణువు కాల యవనికపై భాసిల్లుతాడు. యోగనిద్ర ద్వారా, అంతర్వీక్షణతో సమస్త జగద్రక్షణ కోసం చింతన చేస్తూ స్థితి కారకత్వాన్ని కొనసాగిస్తాడు. తన అంతర్భాగంలో ఉన్న అఖిలాండ కోటి బ్రహ్మాండాన్ని సదా పరిరక్షిస్తుంటాడు. శ్రీమహావిష్ణువు ధ్యాన పరంపర కార్తిక శుద్ధ ఏకాదశి వరకు, అంటే తొలి ఏకాదశి నుంచి నాలుగు నెలలపాటు కొనసాగుతుంది. అందుకే ఈ కాలంలో యతీశ్వరులు చాతుర్మాస్య దీక్షను ఆచరిస్తారు.

తొలి ఏకాదశి నుంచే సనాతన సంప్రదాయంలో పండుగలు, పర్వదినాల సమాహారం ఆరంభమవుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలం ఉపాసనా కాలమైతే, దక్షిణాయనం దైవారాధన తరుణం. ఉత్సవ సంరంభాలు, దీక్షా విధులు, నియమ పూర్వక విధివిధానాలకు దక్షిణాయనం ఆలవాలం. అలాంటి ధర్మాచరణకు తొలి ఏకాదశి శుభ శ్రీకారం చుడుతుంది. తొలి ఏకాదశి పర్వదినం నుంచే జీవుల్లో జాగృతశక్తి సమధికమవుతుందని చతుర్వర్గ చింతామణి వెల్లడించింది. ఆరోగ్య నియమాల అనుసరణకు, ఆధ్యాత్మిక విధుల ఆచరణకు తొలి ఏకాదశి ప్రాతిపదిక. చాతుర్మాస్య దీక్ష పేరిట, ఈ నాలుగు నెలలూ శాకాహారాన్ని మాత్రమే స్వీకరించాలని, కఫాన్ని దూరం చేసి శరీరానికి పుష్టినిచ్చే పదార్థాల్ని ఆహారంలో చేర్చుకోవాలని చరక సంహిత ప్రస్తావిస్తోంది.

కృతయుగంలో మురాసురుణ్ని తన నుంచి వ్యక్తమైన యోగమాయతో విష్ణువు సంహరించాడని, ఆ యోగమాయనే "ఏకాదశి" తిథిగా విష్ణువు అనుగ్రహించాడని చెబుతారు. విష్ణుభగవానుడి ఇరవైనాలుగు రూపాలైన కేశవ నుంచి శ్రీకృష్ణ వరకు ఉన్న నామధేయాలు ఏకాదశి తిథులకు అధిష్ఠాన మూర్తులు. మార్గశిరం నుంచి కార్తికం వరకు ఉండే ఏకాదశుల్ని హరి దీప్తులుగా పద్మపురాణం పేర్కొంది. పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాల్ని కలిపి ఇంద్రియ దశకం అంటారు. వీటికి మనసును మేళవిస్తే ఏకాదశ ఇంద్రియాలవుతాయి. ఈ ఇంద్రియాలకు సంకేతమే ఏకాదశి తిథి. సమస్త ఇంద్రియాల్ని ఏకోన్ముఖం చేసి ఏకాదశినాడు విష్ణు కృపను ఆకాంక్షించాలని ‘ఏకాదశీ మహాత్మ్యం’ నిర్దేశించింది. ఎన్నో విశేషాల ఆధ్యాత్మిక ప్రక్రియల రాశి- తొలి ఏకాదశి!

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.