కరోనా వైరస్ కన్నా.. ఆ మహమ్మారి మనకు వస్తుందేమోనన్న భయమే మనిషిని సగం చంపేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో 15 రోజుల్లోనే నలుగురు వైరస్ భయంతో బలవన్మరణాలకు పాల్పడ్డారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి విజయవాడలో క్వారంటైన్ సెంటర్లో కరోనాకు చికిత్స పొందుతూ.. ఉన్నట్టు ఉండి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గన్నవరం మండలంలో హరిబాబు అనే వృద్ధుడి కరోనా పరీక్ష చేయించుకుంటే వైరస్ నిర్ధరణ అవుతుందనే భయంతో చెరువులోకి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. విజయవాడకు చెందిన పవన్‌కుమార్ కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చినా.. ఆరోగ్యం కుదుటపడనందున ఆందోళనకు గురై ఇంట్లోనే ఉరేసుకుని మృతిచెందాడు. గుంటూరు జిల్లాకు చెందిన ఒక వ్యక్తి కరోనా వచ్చిందని.. కాలవలోకి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. వైరస్ భయం ఇలా చాలామందిని ప్రాణాలు తీసుకొనేలా చేస్తోంది.
తనకు వైరస్ సోకితే పరిస్థితి ఎలా ఉంటుంది? చికిత్స అందుతుందా? మరణం తప్పదా? కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? అనే ప్రశ్నలు జనాన్ని వేధిస్తున్నాయని వైద్యులు అంటున్నారు. ఒకవేళ కొవిడ్ సోకితే.. తాను జీవించడం వృథా అనే భావన వారిలో వస్తుందని చెబుతున్నారు. కుంగుబాటుకు లోనటవంతో పరిస్థితులు ఆత్మహత్యకు దారితీస్తున్నాయని విశ్లేషిస్తున్నారు.
పాజిటివ్ వచ్చిన తర్వాతే కాదు.. రాకముందే మానసికంగా సిద్ధం కావాలని నిపుణులు సూచిస్తున్నారు. మరణం ఒక్కటే పరిష్కారం కాదని.. వైరస్‌ను జయించే మార్గాలపై దృష్టిపెట్టాలంటున్నారు.
ఇంట్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆశావహ దృక్పథాన్ని కలిగించాలి. దీని వల్ల కుటుంబంలో ధైర్యం వస్తుంది. ఇంటి నుంచి ఇది మొదలైతే, సమాజంలో మార్పు వస్తుందని మానసిక వైద్యులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: ఆ రాష్ట్రానికి వెళ్లే వాహనాలపై ఆంక్షలు