తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య విభజన వివాదాల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ఉపసంఘం సమావేశం మరోమారు వాయిదా పడింది. కమిటీ రెండో సమావేశం కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఆధ్వర్యంలో ఇవాళ జరగాల్సి ఉంది. ఆ తర్వాత భేటీని 27వ తేదీకి మార్చారు. తాజాగా ఉపసంఘం సమావేశాన్ని మరోమారు వాయిదా వేశారు. కమిటీ తదుపరి సమావేశం జూన్ 15న జరగనుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ నుంచి రెండు రాష్ట్రాలకు సమాచారం అందింది. 15వ తేదీ ఉదయం 11 గంటలకు దృశ్యమాధ్యమం ద్వారా సమావేశం జరగనుంది.
ఉపసంఘంలో సభ్యులుగా ఉన్న తెలంగాణ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు, ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.ఎస్.రావత్ సమావేశంలో పాల్గొంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన అంశాలు, సమస్యలపై భేటీలో చర్చిస్తారు. దిల్లీలోని ఏపీభవన్ విభజన, విభజన చట్టం తొమ్మిదో షెడ్యూల్లోని సంస్థల విభజనపై చర్చ జరగనుంది. సింగరేణితో పాటు అనుబంధ సంస్థ ఆప్మెల్ విభజన అంశంతో పాటు విభజనచట్టంలో పేర్కొనని సంస్థల విభజనపై ఉపసంఘం చర్చించనుంది.
ఇవీ చూడండి: