దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసులో నిందితుల ఎన్కౌంటర్ కేసు విచారణపై కరోనా ప్రభావం పడింది. విచారణలో భాగంగా న్యాయ విచారణ కమిషన్ ఎన్కౌంటర్ జరిగిన స్థలంతో పాటు పలు ప్రాంతాలను పరిశీలించాల్సి ఉంది, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అది సాధ్యపడదని కమిషన్ కార్యదర్శి శశిధర్ రెడ్డి తెలిపారు.
కేసు విచారణను ఆన్లైన్లో నిర్వహించాలని భావించిన కమిషన్.. విచారణ గోప్యత, సాక్షుల భద్రత దృష్ట్యా వీలుపడదని నిర్ణయించినట్లు వెల్లడించారు. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విచారణ వేగంగా చేయాలని కమిషన్ ప్రయత్నిస్తోందని శశిధర్ రెడ్డి చెప్పారు.
దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు న్యాయ విచారణ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఫిబ్రవరి 3న త్రిసభ్య కమిషన్ తొలిసారి విచారణ చేపట్టింది. మార్చి 23, 24 తేదీల్లో తదుపరి విచారణ చేపట్టాల్సి ఉండగా, లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. లాక్ డౌన్ ఎత్తివేసినప్పటికీ కరోనా కారణంగా అంతర్రాష్ట్ర రాకపోకలు ఇబ్బందిగానే ఉన్నాయని, కమిషన్ కార్యాలయంలోని సిబ్బంది కూడా కరోనా బారిన పడటం వల్ల విచారణకు అవాంతరాలు ఏర్పడ్డాయని కమిషన్ కార్యదర్శి శశిధర్ రెడ్డి తెలిపారు.
ఎన్కౌంటర్ లో మృతి చెందిన నిందితుల కుటుంబ సభ్యులతో పాటు ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులు అఫిడవిట్లు దాఖలు చేశారని... ఇప్పటివరకు 1365 అఫిడవిట్లు కమిషన్ వద్దకు వచ్చాయని శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి ఇంకా స్పందన రాలేదని ఆయన తెలిపారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదికలను కమిషన్ సేకరించిదని... పోస్టుమార్టం రిపోర్టును సమీకరించినట్లు వెల్లడించారు. లాక్ డౌన్ సమయంలోనూ కమిషన్ కార్యాలయం పని చేసిందని... తెలుగులో ఉన్న చాలా అఫిడవిట్లను ఆంగ్లంలోకి అనువదించి త్రిసభ్య కమిషన్ సభ్యుల చిరునామాకు చేరవేశామని కమిషన్ కార్యదర్శి చెప్పారు.
ఇవీ చూడండి: కొందరిలో కొవిడ్ ఉన్నా.. పరీక్షల్లో నెగిటివ్..