Chetak diamond jubilee : వాయుసేనలో 60 ఏళ్లుగా నిర్విరామంగా సేవలందిస్తోంది చేతక్ హెలికాప్టర్. ఆరు దశాబ్ధాలుగా వాయుసేనలో కొనసాగుతున్న ఈ హెలికాప్టర్‌ను ఆర్మీ, కోస్ట్‌గార్డ్‌లోనూ దీన్ని వినియోగిస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్నో ఆపరేషన్లలో పాలుపంచుకుంది. దేశ సేవలో నిర్విరామంగా ఆరు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారత వాయుసేన ప్రత్యేకంగా చేతక్ హెలికాప్టర్‌కు డైమండ్‌జూబ్లీ ఉత్సవాలను హకీంపేట ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో నిర్వహిస్తోంది. ఉగాది రోజు జరిగే వేడుకలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు.
చరిత్ర ఘనం : పాత తరం హెలికాప్టరే అయినా ఎంతో చరిత్ర చేతక్ సొంతం. బహుళ ప్రయోజనకారిగా కార్గో, ట్రాన్స్‌పోర్ట్, అత్యవసర వైద్యం, సెర్చ్, ఏరియల్ సర్వే, పెట్రోలింగ్, ఆఫ్ షోర్ ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించింది. బెంగళూరులోని హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) దీన్ని ఉత్పత్తి చేస్తోంది. 1965లో మొదటి హెలికాప్టర్‌ను తయారు చేశారు. టర్బో షాఫ్ట్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇప్పటివరకు హెచ్‌ఏఎల్ 350 వరకు హెలికాప్టర్లను మన దేశంతో పాటూ విదేశాలకూ విక్రయించింది.
Chetak Helicopter : భారత్, పాకిస్థాన్ సరిహద్దులో సముద్ర మట్టానికి 18వేల అడుగుల ఎత్తులో సియాచిన్‌లో ఉన్న సైనిక క్యాంపులకు కావాల్సిన ఆహారాన్ని చేతక్ చేరవేస్తోంది. చెన్నైలో 2015 వరదల్లో చిక్కుకున్న నిండు గర్భిణిని కాపాడిందీ ఈ హెలికాప్టరే.
మరి కొన్నేళ్లు కొనసాగింపు : "ఏప్రిల్ 2న 9 చేతక్ హెలికాప్టర్లతో ఆకాశంలో డైమండ్ ఆకారంలో విన్యాసాలు ఉంటాయి. వీటితో పాటూ పిలాటస్, కిరణ్, సూర్యకిరణ్ యుద్ధ విమానాలతో గగనతలంలో వైమానిక విన్యాసాలుంటాయి. 10 నిమిషాల పాటు జరిగే ప్రదర్శనను రక్షణమంత్రి రాజ్‌నాథ్ వీక్షించనున్నారు. ఆర్మీ, నేవి, ఎయిర్‌ఫోర్స్ అధిపతులు వస్తున్నారు. పాత చేతక్‌ను కొనసాగిస్తూనే ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా కొత్త తరం లైట్ యుటిలిటీ హెలికాప్టర్లు(ఎల్‌యూహెచ్) వాయుసేనలో దశలవారీగా చేరనున్నాయి."
- ఎయిర్ కమోడోర్ మనీష్ సభర్వాల్, ఏవోసీ, హకీంపేట ఎయిర్‌ఫోర్స్ అకాడమీ
- ఇదీ చదవండి : భారత్‌లో తొలి హైడ్రోజన్ కారు.. గడ్కరీ ట్రయల్స్..