హైదరాబాద్‌లోని కొన్ని డయోగ్నస్టిక్ కేంద్రాల్లో (Diagnostic centers) దోపిడి ఆగడం లేదు. కరోనా చికిత్సల్లో పలు ప్రైవేటు ఆస్పత్రుల అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇదే సమయంలో వివిధ రకాల ఆరోగ్య పరీక్షలను నిర్వహించే డయగ్నస్టిక్ కేంద్రాల అక్రమాలపై దృష్టిసారించడం లేదు. దీంతో సంబంధిత సంస్థలు పరీక్షల కోసం వచ్చే వారి దగ్గర భారీగా దండుకుంటున్నాయి. దీనిపై జిల్లా స్థాయిల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలు చేస్తే.. కొంతవరకు అడ్డుకట్ట పడొచ్చని అంతా భావిస్తున్నారు. అయితే ఇంత జరుగుతున్నా ఎందుకో.. సంబంధిత అధికారులు మాత్రం కార్యాలయాలు వీడి బయటకు రావడం లేదు. దీనిపై పెద్దఎత్తున విమర్శలు రేగుతున్నాయి.
అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్నారు..
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో గత పదిరోజులుగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య కొంత మేరకు తగ్గింది. దీంతో ప్రైవేటు ఆస్పత్రుల్లో సాధారణ, ఆక్సిజన్ పడకలు( Oxygen beds) 40 శాతం వరకు ఖాళీగా ఉన్నాయి. ఇదే సమయంలో ఏదైనా అనారోగ్యం వస్తే అది కొవిడా(Covid-19)? లేక బ్లాక్ ఫంగస్ వ్యాధా అనే అనుమానంతో వేలాది మంది డయోగ్నస్టిక్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. ఈ రెండింటికే కాకుండా కొవిడ్ తగ్గిన తరువాత కూడా అనేక రుగ్మతలకు గురైన చాలామంది వైద్యుల సిఫార్సు మేరకు పరీక్షల కోసం వెళ్తున్నారు. ఈ పరిస్థితిని సొమ్ము చేసుకోవడానికి నగరంలో పేరొందిన ల్యాబ్‌లు కూడా ఆరోగ్య పరీక్షల రేట్లను మూడింతలు పెంచాయి.
యాంటీబాడీకి సంబంధించి రెండు రకాల పరీక్షల ధరలు రూ.2500 నుంచి రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నారు. రెండు నెలల కిందటి వరకు దీని ధర కేవలం రూ.1200 మాత్రమే. ఇది కాకుండా కొవిడ్ నిర్ధారణ కోసం చేసే సీటీ స్కాన్‌కు(City Scan) రూ.3- 4 వేల వరకు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం బ్లాక్ ఫంగస్ (Black Fungus) నిర్ధారణకు నిర్వహించే పరీక్షలకు పెద్దఎత్తున డిమాండ్ ఉంది. ఆయా టెస్ట్‌లకు మూడు రెట్ల ఫీజు వసూలు చేస్తున్నారు.
కన్నెత్తి చూడని వైద్య ఆరోగ్య శాఖ!
డయోగ్నస్టిక్ కేంద్రాల అక్రమాలపై వైద్య ఆరోగ్య శాఖ (Health department) అధికారులు ఏమీ పట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. సొంతంగా ఉండే ప్రైవేటు ల్యాబ్‌లే కాకుండా ఆస్పత్రులకు అనుబంధంగా ఉండే వాటిలోనూ ఇదే దోపిడీని కొనసాగిస్తున్నాయి. ఈ మొత్తం అక్రమాలపై చర్యలు తీసుకోవాలంటూ వందలాది మంది కాల్ సెంటర్‌కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఇన్ని ఫిర్యాదులు వచ్చినా కూడా అధికారులు దీనిపై దృష్టిపెట్టకపోవడం పట్ల పెద్దఎత్తున అనుమానాలు వస్తున్నాయి.
వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 70కు పైగా ఆస్పత్రులకు నోటీసులు ఇవ్వడం.. కొన్నింటికి కొవిడ్ చికిత్స అనుమతిని రద్దు చేయడంతో ప్రైవేటు ఆస్పత్రుల వైఖరిలో గణనీయంగా మార్పు వచ్చింది. కొన్ని ఆస్పత్రులు ఫిర్యాదుల భయంతో ప్రభుత్వం పేర్కొన్న రేట్లనే వసూలు చేస్తున్నాయి. ఇలానే ప్రైవేటు డయోగ్నస్టిక్ కేంద్రాల అక్రమాలపై కన్నెర్ర చేయాలని అనేకమంది కోరుతున్నారు. దీనిపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులను వివరణ అడిగితే ప్రస్తుతం ఆస్పత్రుల అక్రమాలపై దృష్టిసారించి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి ఆస్పత్రులకు నోటీసులు ఇస్తున్నాం... త్వరలో పరీక్షల కోసం భారీగా వసూలు చేసే ల్యాబ్‌లపై దృష్టిసారిస్తామని చెప్పారు.