గతేడాది పేలవ ఆటతీరుతో ప్లేఆఫ్స్ చేరకుండా ఇంటిముఖం పట్టిన చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి అందరికన్నా ముందు ఆ బెర్తును ఖరారు చేసుకుంది. గురువారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడిన సందర్భంగా ధోనీసేన 6 వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. దీంతో చెన్నై ఈ సీజన్‌లో తొమ్మిదో విజయం సాధించి 18 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. కాగా, గతరాత్రి చివరి ఓవర్‌లో మహీ(14*) సిక్సర్‌తో చెన్నైకి విజయాన్ని అందించిన తీరు ఇప్పుడు అభిమానులను అలరిస్తోంది. సిద్ధార్థ్ కౌల్ వేసిన 19.4 బంతిని ధోనీ స్టాండ్స్‌లోకి తరలించి తన జట్టును ఘనంగా ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లాడు. ఇప్పుడా వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లుకొడుతోంది.
సంతోషంగా ఉంది: ధోనీ
ఇక మ్యాచ్ అనంతరం ధోనీ మాట్లాడుతూ తమ జట్టు అందరికన్నా ముందు ప్లేఆఫ్స్‌కు చేరడం చాలా సంతోషంగా ఉందని, ఇదెంతో ప్రత్యేకమని తెలిపాడు. ఐపీఎల్ చరిత్రలో గతేడాది తొలిసారి ప్లేఆఫ్స్ చేరకుండా నిష్క్రమించిన నేపథ్యంలో.. తాము తిరిగి బలంగా పుంజుకొని వస్తామని అప్పుడే చెప్పినట్లు గుర్తుచేశాడు. ‘ఎప్పుడూ మేం ప్లేఆఫ్స్ చేరే జట్టని అందరికీ తెలిసిందే. అయితే, ప్రతిసారి మ్యాచ్‌లు గెలవడం జరగదు. గతేడాది మాకు అనేక విషయాలు కలిసిరాలేదు. అప్పుడు విఫలమవ్వడం గురించి కారణాలు చెప్పడం సరికాదు. అప్పుడు కానిది ఇప్పుడు చేశాం. ఈ సీజన్‌లో చెన్నై ముందుకు వెళ్లడానికి ఆటగాళ్లు బాగా ఆడారు. ప్రతి ఒక్కరూ రాణించారు. ఈ విజయంలో సహాయక సిబ్బంది కూడా ముఖ్య పాత్ర పోషించారు. వాళ్లకూ ఈ క్రెడిట్ దక్కుతుంది. ఇక ఈ పిచ్‌పై కాస్త ఎక్కువ బౌన్స్ ఉంది. పిచ్‌పై బ్యాట్స్‌మెన్‌కు అవగాహక కలిగాక విజయవంతమయ్యారు’ అని ధోనీ వివరించాడు. చివరగా అభిమానుల గురించి మాట్లాడుతూ.. వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదన్నాడు. గెలుపోటములతో సంబంధం లేకుండా జట్టుకు వెన్నంటే ఉన్నారన్నాడు. ఇప్పుడు వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టినందుకు (ప్లే ఆఫ్స్ చేరడం) సంతోషంగా ఉందని చెన్నై కెప్టెన్ హర్షం వ్యక్తం చేశాడు.