ఆహ్లాదం, ఆనందం, ఆరోగ్యాన్ని అందించే సంగీతం.. సామాన్యుల నుంచి సంపన్నుల జీవితాల్లో భాగమైంది. ఒత్తిడిని దూరం చేస్తూ.. వినోదాన్ని పంచే ఈ సరిగమల్ని పలకించటంలో వాయిద్యానికో ప్రత్యేకత ఉంటుంది. వేణుగానం, పియానో, గిటార్, వీణ వంటి వాయిద్యాలు మనసును తాకే బాణీలకు ప్రాణం పోస్తే.. హుషారైన మాస్ బీట్‌లకు జాజ్, డ్రమ్స్ లాంటివి చిరునామాగా నిలుస్తుంటాయి. వేడుకలు, ఉత్సవాల్లో ఆనందాన్ని రెట్టింపు చేస్తుంటాయి. అద్భుత ప్రతిభ, ఆకట్టుకునే ప్రదర్శనలతో డ్రమ్మర్‌గా జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.. సౌరభ్ గదావి.
వద్దని వారించినా..
సౌరభ్ గదావి.. గుజరాత్‌కు చెందిన ప్రముఖ సంగీత వాయిద్యాకారుడు. పుట్టుకతోనే దివ్యాంగుడైన సౌరభ్.. ఎడమచేయి లోపం గురించి ఆలోచించక..సంగీతంపై దృష్టి సారించాడు. స్నేహితులు వివిధ రకాల సంగీత వాద్యాల్లో శిక్షణ తీసుకుంటే.. సౌరభ్ జాజ్‌పై ఆసక్తిని పెంచుకున్నాడు. ఇతర వాద్యాలతో పోలిస్తే.. జాజ్‌ను వాయించటానికి రెండు చేతులు చాలా అవసరం. ఐదారు రకాల డ్రమ్స్‌ను బలంగా కొట్టాల్సి ఉంటుంది. మిత్రులు, కుటుంబసభ్యులంతా.. వద్దని వారించారు. సౌరభ్ మాత్రం మరో ఆలోచన చేయలేదు. ప్రయత్నం ఆపలేదు.
నిరంతర సాధన
సౌరభ్.. ఎడమ చేయి కేవలం మోచేతి వరకు ఉంటుంది. జాజ్ వాయించేందుకు అవసరమైన డ్రమ్స్ స్ట్రిక్‌ను పట్టుకునేందుకు కూడా అవకాశం ఉండేది కాదు. డ్రమ్మర్‌గా గుర్తింపు తెచ్చుకోవాలనే కసితో స్ట్రిక్‌ను వస్త్రంతో మోచేతికి కట్టుకుని సాధన ప్రారంభించాడు. ఇలా జాజ్‌ను వాయించే క్రమంలో అనేక అవరోధాలు పలకరించాయి. కాసేపు సాధన చేస్తేనే విపరీతమైన నొప్పి కలిగేది. వాయిస్తున్నప్పుడు మోచేతి వస్త్రం నుంచి డ్రమ్స్ స్ట్రిక్ కిందపడేది. ఇలాంటి సమస్యలు ఎదురైనా.. సౌరభ్ సంగీతాన్ని వదిలిపెట్టలేదు. నిరంతర సాధనతో జాజ్ వాయించటంలో మంచి పట్టు సాధించాడు.
ప్రముఖుల ప్రశంసలు
పట్టుదలతో ప్రయత్నించటం ద్వారా సౌరభ్.. పాఠశాల, కళాశాల దశలోనే అనేక ప్రదర్శనలిచ్చాడు. అనుకున్న ఫలితం సాధించాడు. దేశంలోనే తొలి దివ్యాంగ డ్రమ్మర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. గుజరాత్ సహా దేశవ్యాప్తంగా వందలాది ప్రదర్శనలిచ్చిన సౌరభ్.. పలు సాంస్కృతిక వేదికలపై ప్రముఖుల ప్రశంసలందుకున్నాడు.
హుషారైన బీట్‌లతో
సౌరభ్.. మిత్రుల సంగీత బృందంతో కలిసి గణేశ్ నవరాత్రులు, దసరా వంటి పండుగల్లో సందడి చేస్తున్నాడు. హుషారైన బీట్‌లతో ఆకట్టుకుంటున్నాడు. గుజరాత్‌లోని ప్రముఖ విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేక ప్రదర్శలిస్తున్న సౌరభ్.. యువతలో ఎనలేని స్ఫూర్తి నింపుతున్నాడు. సంగీతంలోని ఆనందాన్ని అందరికి పంచుతున్నాడు.
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన సౌరభ్..
లక్ష్యసాధనలో ఓటమి పలకరిస్తే చాలు.. మరో ప్రయత్నం గురించి ఆలోచించక యువత ఆత్మహత్యలకు మెుగ్గు చూపుతోంది. ఇలాంటి తరుణంలో విధి వైకల్యంతో వెక్కిరించినా.. వెన్ను చూపక.. సౌరభ్ అసాధ్యం అనుకున్న లక్ష్యాన్ని సుసాధ్యం చేశాడు. దేశంలోనే తొలి దివ్యాంగ డ్రమ్మర్‌గా అందరి మెప్పు పొందుతున్నాడు.