గత కొద్దిరోజులుగా ఎక్కువ మంది మేక, గొర్రె మాంసం తినేందుకే మొగ్గుచూపుతున్నందున దానికి అనూహ్యంగా గిరాకీ పెరిగింది. ధరలు కొండెక్కాయి. గత నెలరోజుల్లోనే కిలో ధర రూ.600 నుంచి రూ.750కి ఎగబాకింది. రెండు, మూడు రోజులుగా కొన్ని ప్రాంతాల్లో రూ.1000 వరకూ అమ్ముడైంది.
కనుమ పండగ నాడు హైదరాబాద్ నగరంలోనే మూడు లక్షల కిలోలకుపైగా మాంసం విక్రయాలు జరిగినట్లు అనధికార అంచనా. తాను ఐదు మేకలు కోసి నాలుగు గంటల వ్యవధిలోనే మాంసం మొత్తం అమ్మేసినట్లు ఎల్‌బీనగర్ ప్రాంతంలోని ఓ వ్యాపారి చెప్పడం దానికున్న గిరాకీని చెప్పకనే చెబుతోంది. తమిళనాడు, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల వ్యాపారులు తెలంగాణ నుంచి మేకలు, గొర్రెలను కొనడం అధికమవడంతో ఇటీవల జీవాల ధరలు అమాంతం పెరిగాయి. ఇక్కడ మాంసం ధర పెరుగుదలకు ఇదే ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారు.
ఇతర రాష్ట్రాల వ్యాపారులు ఎక్కువ ధరలు చెల్లించి జీవాలు కొనేందుకు సిద్ధమవుతుండటంతో, తామూ అంతే చెల్లించాల్సి వస్తోందని, ఆ మేరకు ధరలు పెంచాల్సి వస్తోందని వారు వివరించారు. తెలంగాణ 2.20 కోట్ల గొర్రెలతో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. గొర్రెల సంఖ్య ఎక్కువగా ఉన్నా ధరలు నిరంతరం పెరుగుతుండటం పట్ల వినియోగదారులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.
వినియోగం పెరగడం వల్లే..
చాలామంది గత నెలరోజులుగా మేక, గొర్రె మాంసానికే ప్రాధాన్యమిస్తున్నారు. రాష్ట్రంలో ధరల పెరుగుదలకు ఇదీ ఒక కారణమే. కొందరు పనిగట్టుకుని కోడిమాంసంపై దుష్ప్రచారం చేస్తున్నందున వినియోగం తగ్గినట్లు మా దృష్టికి వచ్చింది. కోడిమాంసం తినడంతో హాని ఏమీ జరగదు.
- లక్ష్మారెడ్డి, పశుసంవర్ధకశాఖ సంచాలకుడు