కరోనా తర్వాత ప్రజల ఆలోచన సరళిలో కూడా మార్పు వచ్చింది. వైరస్ కారణంగా ఇంకా పూర్తిస్థాయిలో ప్రజా రవాణా ఊపందుకోలేదు. ఈ నేపథ్యంలో వాడిన ద్విచక్ర వాహనాలు, కార్ల కొనుగోలుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.
సొంతంగా.. తక్కువ బడ్జెట్‌లో..
కరోనా ముప్పు కొంత తగ్గినా ఆర్టీసీ బస్సుల నుంచి మెట్రో వరకు ప్రయాణికుల సంఖ్య ఇంకా పెరగలేదు. కరోనాకు ముందు మెట్రోలో 4.5 లక్షల ప్రయాణికుల ట్రిప్పులు ఉండేవి. ప్రస్తుతం ఆ సంఖ్య 1.6 లక్షలకు దాటడం లేదు. ఆర్టీసీలోనూ అదే తీరు. గతంలో నిత్యం 30 లక్షల మంది రాకపోకలు సాగించేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 60-70 శాతమే మాత్రమే. ఎక్కువ మంది సొంత వాహనాల్లో వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొత్త కారు కొనేముందు కొన్నాళ్లు పాతది వాడితే తక్కువ బడ్జెట్‌లో రావడంతోపాటు డ్రైవింగ్ కూడా నేర్చుకోవచ్చు అని భావిస్తున్నారు.
2 వేలు కొత్తవి.. పాతవి..
గ్రేటర్ వ్యాప్తంగా రోజుకు 2 వేల కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. అదేస్థాయిలో పాత వాహనాలూ చేతులు మారుతున్నాయి. నగరంలో రాంకోఠి, కింగ్‌కోఠి, ఖైరతాబాద్, మెహిదీపట్నం, ఎల్‌బీనగర్, సికింద్రాబాద్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో ఈ తరహా మార్కెట్లకు రద్దీ పెరుగుతోంది. ఏ చిన్నకారు కొనాలన్నా కనీసం రూ.4-5 లక్షలు ఉండాలి. దీంతో పాత కార్ల వైపు మొగ్గు చూపుతుంటారు. పాత కార్లకూ కొన్ని సంస్థలు రుణం ఇస్తున్నాయి. ఆన్‌లైన్‌లో కార్లను అమ్మకాలకు పెడుతున్నాయి.
- ఇదీ చూడండి : రానున్నది మరింత 'స్మార్ట్' కాలం..!