"ఎన్నికల్లో పోటీకి ఓటరు గుర్తింపు కార్డు పని చేస్తుంది. పౌరసత్వానికి మాత్రం పనికి రాదా? ఆ కార్డు ఉన్న వాళ్లు వేసిన ఓట్లతో చట్టసభల్లో చట్టాలను చేస్తున్నాం. వారి పౌరసత్వానికి మాత్రం అది పని చేయదా? ఇదేం విధానం? ఈ చట్టం విషయంలో పార్లమెంటులో ఒకటి చెబుతున్నారు. బయట చెబుతున్నది ఇంకొకటి. ప్రభుత్వం చేస్తున్నది తప్పు అని చెబితే దేశద్రోహులంటున్నారు. పాకిస్థాన్ ఏజెంట్ అని అంటున్నారు. గతంలోనే పౌరసత్వ ప్రయోగం జరిగింది. అది ఆచరణాత్మకం కాదని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. ఇదీ ఆమోదయోగ్యం కాదు. ఇదేదో ముస్లింలకు వ్యతిరేకంగా తెచ్చింది కాదు. దేశంలోని పేదలకు వ్యతిరేకంగా తెచ్చింది. దాన్ని కేంద్రం పునఃసమీక్షించాల్సిందే."
- కేసీఆర్
చాలా బాధపడ్డాను
భారతదేశానికి అతిథులు వచ్చినప్పుడు ప్రతిపక్షాలు కూడా సంయమనంతో వ్యవహరిస్తాయి. కానీ ఇక్కడ జరిగిందేమిటి? అని కేసీఆర్ ప్రశ్నించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిల్లీలో ఉండగానే అక్కడ పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. రాజకీయాల్లో విధానపరమైన విభేదాలు ఉంటాయి. కానీ మరీ ఇంత దారుణంగానా? అని నిలదీశారు. తాను చాలా బాధపడ్డానని తెలిపారు. కేంద్రం తీసుకువచ్చిన చట్టం బడుగు బలహీనవర్గాలు, పేదలకు, సంచార జాతులకు తీవ్ర విఘాతం కలిగిస్తుందని పేర్కొన్నారు.
తీర్మానాలతో పని జరగదు..
రాష్ట్ర ప్రభుత్వం చేసే తీర్మానాలతో పని జరగదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. జాతీయ జనాభా పట్టిక(ఎన్‌పీఆర్) నమోదుకు శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించాలంటూ ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలిచ్చారని గుర్తుచేశారు. వాటిని ఆపివేస్తూ ఎన్‌పీఆర్ అవసరం లేదని ప్రత్యేక ఉత్తర్వును రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయాలన్నారు. కేరళ ప్రభుత్వం ఇలానే చేసిందని చెప్పుకొచ్చారు.
భాష తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది..
పౌరసత్వ సవరణ చట్టం నిబంధనల రూపకల్పనలో వినియోగించిన భాష తీవ్ర ఆవేదనకు గురి చేస్తోందని అక్బరుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. పుట్టిన తేదీ ధ్రువపత్రం లేకపోతే పెళ్లి తేదీ ఆధారంగా వయసును అంచనా వేస్తారటా అని ఎద్దేవా చేశారు. ఇలాంటి నిబంధనలను పెట్టిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..
సీఏఏ అనేది పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌లలో నివసించే అల్పసంఖ్యాక వర్గాల ప్రజలు ఇక్కడికి శరణార్థులుగా వస్తే వారికి భారత పౌరసత్వం కల్పించడానికి ఉద్దేశించిందని భాజపా ఎమ్మెల్యే రాజసింగ్ స్పష్టం చేశారు. దేశ ప్రజలకు ఈ చట్టంతో సంబంధం ఉందని రుజువు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని తేల్చిచెప్పారు.
ఇవీ చూడండి: 'అధికారం మీకే అప్పగిస్తాం... 50 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తారా?'