హైదరాబాద్ జలమండలిలో 43 శాతానికిపైగా మురుగు నీటిని శుద్ధిచేస్తున్నట్లు జలమండలి ఎండీ దానకిశోర్ తెలిపారు. మిగతా నగరాల్లో 20 నుంచి 30 శాతం మురుగు నీటిని మాత్రమే శుద్ధిచేస్తున్నారని చెప్పారు.
నాగోల్‌లోని మురుగు నీటి శుద్ధి కేంద్రాలను దానకిషోర్ పరిశీలించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటి వరకు రోజూ 1781 మిలియన్ లీటర్ల మురుగు నీరు ఉత్పన్నమైతే.. జలమండలి ద్వారా 770 మిలియన్ లీటర్లను శుద్ధిచేసి మూసిలోకి విడిచిపెడుతున్నట్లు తెలిపారు. నాగోల్ ఎస్టీపీలో (స్వేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్) ఇప్పటికే 172 ఎంఎల్డీల (మిలియన్ ఆఫ్ లీటర్స్ పెర్ డే) మురుగు నీరు శుద్ధి జరుగుతుందని పేర్కొన్నారు.
ప్రస్తుతం శుద్ధి చేస్తున్న మురుగు నీటితోపాటు మరో 10 శాతం అదనంగా శుద్ధి చేసేందుకు ఏర్పాటుచేయాలని అధికారులను దానకిశోర్ ఆదేశించారు. ఎల్బీనగర్, అంబర్పేట్, నాగోల్‌కు వచ్చే మురుగును నాగోల్ ఎస్టీపీకి మళ్లించి.. 20 ఎంఎల్డీ మురుగు నీటిని శుద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
అత్యవసర వినియోగానికి ఏర్పాటుచేసిన నీటి మోటార్లకు మరమ్మతులు చేపట్టాలన్నారు. ఎస్టీపీలలో రియాక్టర్ల వద్ద పేరుకుపోయిన మట్టిని చూసి ఎండీ అసహనం వ్యక్తం చేశారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఎస్టీపీలకు నలువైపులా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎస్టీపీ పర్యవేక్షణ ఆన్లైన్ చేయాలని సూచించారు.
ఇవీచూడండి: పరిజ్ఞానం, అంతర్జాతీయ గుర్తింపు@ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి