వానాకాలంలో ప్రాజెక్టుల కింద సాగు లక్ష్యం 41.09 లక్షల ఎకరాలు కాగా.. ఆ దిశగా నీటిపారుదలశాఖ సమాయత్తమవుతోంది. ఈ ఏడాది జలాశయాల్లోకి ప్రవాహాలు మెరుగ్గా ఉండటంతో అనేక ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు.
నాగార్జునసాగర్‌తో సహా మరికొన్ని ప్రాజెక్టుల కింద త్వరలోనే నీటి విడుదలపై నిర్ణయం తీసుకోనున్నారు. రెండు మూడు మినహా మిగిలిన అన్ని ప్రాజెక్టుల కింద వానాకాలం పంటల సాగు ఆశాజనకంగా కనిపిస్తోంది.
ఈ ఖరీఫ్‌లో భారీ ప్రాజెక్టుల కింద 36.55 లక్షల ఎకరాలు, మధ్యతరహా ప్రాజెక్టుల కింద 3.24 లక్షల ఎకరాలు, చిన్న ఎత్తిపోతల పథకాల కింద లక్షా 30వేల ఎకరాల ఆయకట్టు సాగు లక్ష్యంగా నీటిపారుదల శాఖ నిర్ణయించింది.
మొత్తం 41.09 లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటలు 21.25 లక్షల ఎకరాల్లోనూ సాగు చేయడానికి 421.7 టీఎంసీల నీరు అవసరమవుతుందని అంచనా వేశారు. చిన్ననీటి పారుదల కింద సాగయ్యే ఆయకట్టు దీనికి అదనం.
అత్యధిక ఆయకట్టు సాగు
గోదావరి బేసిన్‌లో శ్రీరామసాగర్ ప్రాజెక్టు వ్యవస్థతో పాటు కృష్ణాబేసిన్‌లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాజెక్టులు, నాగార్జునసాగర్, ఏఎంఆర్‌పీ కింద అత్యధిక ఆయకట్టు సాగు కానుంది.
కృష్ణా బేసిన్‌లో పరిస్థితి ఆశాజనకంగా ఉండటం, ఆలమట్టి నుంచి ముందుగానే నీటిని విడుదల చేయడంతో జూరాలతో పాటు ఈ ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసే భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాల కింద కాలువలకు నీటిని వదిలారు. జూరాల నుంచి అన్ని ప్రాజెక్టులకు కలిపి 5,300 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. శ్రీశైలం నుంచి కల్వకుర్తి ఎత్తిపోతలకు 800 క్యూసెక్కుల నీటిని వదిలారు.
సింగూరు, నిజాంసాగర్ మినహా..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రాజెక్టుల కింద 8.11 లక్షల ఎకరాలకు 93 టీఎంసీల నీటిని వినియోగించి సాగు చేయనున్నారు. ఇందులో మెట్టపంటల సాగు ఎక్కువగా ఉంది. శ్రీశైలం నుంచి విద్యుదుత్పత్తి ద్వారా గత మూడు రోజులుగా నీటిని విడుదల చేస్తున్నారు.
నాగార్జునసాగర్‌లో బుధవారం నీటిమట్టం 533.7 అడుగులతో 175.45 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం నుంచి 42వేల క్యూసెక్కులు వస్తోంది. ఈ నేపథ్యంలో గత ఏడాది కంటే ముందుగానే నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. గోదావరిలో సింగూరు, నిజాంసాగర్ మినహా మిగిలిన అన్ని ప్రాజెక్టుల పరిస్థితి ఆశాజనకంగా ఉంది.
‘దేవాదుల’ పరిధిలో 2.43 లక్షల ఎకరాలకు
దేవాదుల ఎత్తిపోతలతో సహా పాకాల చెరువు, రామప్ప చెరువు, లక్నవరం, మల్లూరువాగు, బొగ్గులవాగు కింద దేవాదుల ఎత్తిపోతల చీఫ్ ఇంజినీర్ పరిధిలో 2.43 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలన్నది లక్ష్యం.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మధ్యతరహా ప్రాజెక్టుల కింద లక్షా ఆరువేల ఎకరాలకు నీరందించాలన్నది లక్ష్యం. పలు ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తూనే చెరువులు నింపనున్నారు. దీంతో ఆయకట్టు మరింత పెరిగే అవకాశం ఉంది.
164 టీఎంసీలతో 16 లక్షల ఎకరాలకు నీరు
శ్రీరామసాగర్, శ్రీరామసాగర్ రెండోదశతో సహా నిజాంసాగర్ ఆయకట్టు పరిధిలో ఉన్న ఎత్తిపోతల పథకాలు ఇలా అన్నీ కలిపి 164 టీఎంసీలతో 16.12 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించనున్నారు.
ఇందులో ఆరుతడి పంటలు 7.88 లక్షల ఎకరాల్లో కాగా, మాగాణి 8.24 లక్షల ఎకరాలు. ఎస్సారెస్పీ వ్యవస్థకు నీరు తక్కువ పడితే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా మళ్లిస్తారు. పునరుజ్జీవ పథకం ద్వారా నీటిని మళ్లిస్తారు. శ్రీరామసాగర్‌లో 36.53 టీఎంసీలు ఉండగా, 6,654 క్యూసెక్కులు వస్తోంది.
వచ్చిన నీటిని వచ్చినట్లుగా కాలువలకు వదులుతున్నారు. మధ్యమానేరు నుంచి విడుదల చేసే నీటితో దిగువ మానేరు మట్టం క్రమంగా పెంచడంతోపాటు 5,146 క్యూసెక్కుల నీటిని కాలువకు వదిలారు.
ఎల్లంపల్లికి వరద వచ్చినా, వరద రాకపోతే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని మళ్లించినా మధ్యమానేరులో నిల్వ పెరుగుతుంది. ఈ నీటిని ఒకవైపున దిగువమానేరుకు, ఇంకోవైపున అనంతగిరి, రంగనాయకసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లకు మళ్లిస్తారు.
ఇవీ చూడండి: వ్యవసాయ శాఖ క్రియాశీలకంగా మారాలి: సీఎం