జాతీయస్థాయిలో మహిళలపై అత్యాచారాల విషయంలో 1,46,201 కేసుల్లో విచారణ చేపట్టగా.. కేవలం 5,882 కేసుల్లోనే శిక్షలు పడ్డాయి. అంటే శిక్షల శాతం 3.98 మాత్రమే! మహిళలపై జరిగే అన్నిరకాల నేరాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో ఏడాదికి దాదాపు 8,500-9,500 వరకూ కేసుల విచారణ న్యాయస్థానాల్లో పూర్తవుతుంది. కానీ వెయ్యి కేసుల్లోనైనా శిక్షలు పడట్లేదు. 2014-17 మధ్య గణాంకాలు విశ్లేషిస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది.
ఏదైనా కేసులో నేరస్తుడికి శిక్షపడాలంటే కేసు నమోదు, దర్యాప్తు, ఆధారాల సేకరణ, సాక్ష్యాలను పకడ్బందీగా న్యాయస్థానానికి సమర్పించటం, నేరం నిరూపితమయ్యేలా వాదించటం కీలకం. వీటిపైనే ఆ కేసు భవితవ్యం ఆధారపడి ఉంటుంది. వీటిలో ఏ ఒక్కదాంట్లో చిన్నతేడా వచ్చినా కేసు వీగిపోయే అవకాశాలు ఎక్కువ. చాలాకేసుల్లో మొదట్లో హడావుడి తప్ప.. నేరాన్ని నిరూపించేలా దర్యాప్తు జరగట్లేదు. అభియోగపత్రాల నాణ్యత అంతంతగానే ఉండటంతో దాని ప్రభావం న్యాయస్థానాల్లో కేసు విచారణపై పడుతోంది.
దోషులెవరు?
ఆయేషా మీరా హత్యకేసు ఎంత సంచలనం కలిగించిందో తెలిసిందే. ఈ కేసులో పోలీసు దర్యాప్తు సక్రమంగా లేదని, కనీస జాగ్రత్తలు పాటించలేదని పోలీసులను న్యాయస్థానం తప్పుబట్టింది. ఈ కేసులో నిందితుడైన సత్యంబాబును నిర్దోషిగా ప్రకటించింది. అంతకుముందు అతనికి జీవితఖైదు విధిస్తూ దిగువ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును రద్దుచేసింది. ఏళ్లు గడుస్తున్నా ఈ కేసులో దోషులెవరో తేలలేదు. ప్రస్తుతం ఈ కేసు సీబీఐ దర్యాప్తుచేస్తోంది.
కొన్నేళ్ల క్రితం విజయవాడ పటమట పోలీసుస్టేషన్ పరిధిలో హిమబిందు అనే వివాహిత హత్యకు గురయ్యారు. ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్టుచేసినా.. వారే నేరం చేసినట్లు నిరూపించేందుకు తగిన సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టలేకపోవటంతో కోర్టులో ఈ కేసు వీగిపోయింది. పోలీసుల వైఫల్యంపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తంచేసింది. ఈ కేసులో దోషులెవరో ఇప్పటికీ తేలలేదు.
ప్రధాన కారణాలివే!
- చాలా సందర్భాల్లో పోలీసుల నుంచి సత్వర స్పందన కొరవడటం
- నేరం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకోలేకపోవటం, ఆధారాల సేకరణలో ఉదాసీనత
- దర్యాప్తులో నాణ్యత క్షీణించటం, క్షేత్రస్థాయి దర్యాప్తునకు ప్రాధాన్యమివ్వకపోవటం
- ఓ కేసు దర్యాప్తులో ఉండగానే.. కొత్త కేసుల బాధ్యతలు మీద పడటంతో పాతవాటిపై శ్రద్ధ చూపలేకపోవటం
- క్షేత్రస్థాయిలో బందోబస్తు, నేరపరిశోధన బాధ్యతలు ఒకరే నిర్వహించాల్సి రావడం
- పరువు పోతుందన్న భయంతో బాధితులు ముందుకు రాకపోవటం
- కొన్ని కేసుల్లో రకరకాల ఒత్తిళ్లతో పరస్పరం రాజీ
- సాక్ష్యం చెప్పేందుకు ఎవరూ ముందుకు రాకపోవటం
- సాక్ష్యం చెబితే నేరగాళ్ల నుంచి ముప్పు భయం, న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి వస్తుందనే భావన
- మహిళలపై నేరాలకు సంబంధించి దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో విచారణ పూర్తవుతున్న ప్రతి వందకేసుల్లో 75 వీగిపోతున్నాయి. 25 కేసుల్లోనే శిక్షలు పడుతున్నాయి
- ఈ తరహా నేరాల్లో జాతీయస్థాయి శిక్షల రేటు కంటే కూడా ఏపీ, తెలంగాణల్లో శిక్షల రేటు చాలా తక్కువగా ఉంది
- మహిళలపై జరిగిన నేరాలకు అతి తక్కువ శిక్షలు పడిన రాష్ట్రాల్లో ఆంధ్ర ప్రదేశ్ 10.3%తో 8వ స్థానంలో ఉంది. ఈ విషయంలో 3.1%తో గుజరాత్ మొదటిస్థానంలోనూ, 3.2%తో పశ్చిమ్ బంగా రెండోస్థానంలో ఉన్నాయి.
ఇదీ చూడండి : 'ఫుల్లుగా తాగి ఉన్నాం.. ఏం చేస్తున్నామో సోయి లేదు'