Blood donation camp: సామాజిక బాధ్యతగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో ముందుండే ఏకైక యానిమేషన్ శిక్షణా సంస్థ క్రియేటివ్ మల్టీమీడియా రెడ్‌క్రాస్ సోసైటీతో కలిసి మరొక స్వచ్ఛంద సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సంస్థలలో పనిచేసే సిబ్బంది, శిక్షణ పొందుతున్న విద్యార్థినీ విద్యార్థులు కలిసి హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లోని సంస్థ ఆవరణలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
దేశంలోనే పెద్ద ఎత్తున చేపట్టే రక్తదాన శిబిరం..
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా 'తలసేమియా' వ్యాధి బారిన పడ్డ చిన్నారుల కోసం ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు ఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రాజశేఖర్ బుగ్గవీటి తెలిపారు. మన దేశంలో రక్తదాన శిబిరాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న యానిమేషన్ శిక్షణా సంస్థ క్రియేటివ్ మల్టీమీడియా మాత్రమే కావడం గమనార్హం. ఈ సందర్భంగా సిబ్బంది, విద్యార్థులు కలిసి 150 యూనిట్ల రక్తాన్ని దానం చేసి ఇతరులకు ఆదర్శంగా నిలిచారు.
ఇదొక అపూర్వ అవకాశం..
అనంతరం రక్తదానం చేసిన విద్యార్థినీలు మాట్లాడారు. మహిళా దినోత్సవం నాడు అందరూ నిర్వహించే సాధారణ కార్యక్రమాలకు భిన్నంగా తమ శిక్షణా సంస్థ నిర్వహించిన రక్తదాన శిబిరం వల్ల తలసేమియా చిన్నారులకు సహాయపడే ఒక అపూర్వ అవకాశం లభించినందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.
హర్షధ్వానాలతో మార్మోగిన కళాశాల ప్రాంగణం...
ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన అనేక కళా రూపాలు ఆకట్టుకున్నాయి. రంగోలి, పోస్టర్ డిజైన్, మెహేంది డిజైన్ పోటీలే కాకుండా ఫొటోగ్రఫీ, పెన్సిల్ ఆర్ట్ మొదలైన సృజనాత్మక పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. ఎంతో ఉత్సహంగా ఆట, పాటల పోటీల్లో పాల్గొని అనేక బహుమతులు గెలుచుకున్న వారి హర్షధ్వానాలతో కళాశాల ప్రాంగణం మారుమోగిపోయింది. సామాజిక బాధ్యతను గుర్తించి సిబ్బంది, విద్యార్థులు, రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో విజయవంతంగా ఈ రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రక్తదాతలందరికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.
ఇదీ చదవండి:వైభవంగా మహిళా దినోత్సవ సంబురాలు