రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ బాధితులకు తగిన సంఖ్యలో బెడ్లు, మందులు, డాక్టర్లు, వైద్య సిబ్బంది, సౌకర్యాలను తక్షణం కల్పించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. బ్లాక్ ఫంగస్‌ను సకాలంలో గుర్తించామని, ఈ వ్యాధికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వంతో పాటు మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు.
బ్లాక్ ఫంగస్‌కు గురైన వందలాది బాధితులు స్థానికంగా పరీక్షలు చేయించుకుని వైద్యానికి హైదరాబాద్ వస్తున్నాయని తమ్మినేని తెలిపారు. దీనికి గురైన వారు చికిత్స కోసం వస్తే పడకలు అందుబాటులో ఉండటం లేదని చెప్పారు. ఇదే పరిస్థితి కొనసాగితే పెద్ద సంఖ్యలో మరణాలు నమోదయ్యే అవకాశముందని ఆవేదన వ్యక్తం చేశారు.
యాంటీ ఫంగల్ మందుల కొరత తీవ్రంగా ఉందని, వైట్ ఫంగస్ కేసులు కూడా నమోదవుతున్నాయని, దీనిపై కూడా ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. టిమ్స్ మాదిరి బ్లాక్ ఫంగస్‌కు ఓ ప్రత్యేక భవనాన్ని కేటాయించాలని కోరారు. ప్రతి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆసుపత్రిలోనైనా బ్లాక్ ఫంగస్‌కు పూర్తి వైద్యాన్ని ఏర్పాటు చేయాలని, అవసరమైన డాక్టర్లు, సిబ్బందిని తక్షణం యుద్ధప్రాతిపదికపై నియమించాలని డిమాండ్ చేశారు.
- ఇదీ చదవండి: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు