రాజ్యసభలో వ్యవసాయ బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదించుకోవడం చీకటి రోజు అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అభిప్రాయపడ్డారు. పెద్దలసభ గౌరవంగా ఉండాల్సిందిపోయి అప్రజాస్వామిక పద్ధతిలో ప్రతిపక్షాల, రాజకీయ పార్టీల గొంతు నొక్కడం రాజ్యసభకే అవమానకరమైన రోజు అని అభివర్ణించారు. వ్యవసాయ బిల్లును తీవ్రంగా ఖండించిన నారాయణ... 14 ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాయని తెలిపారు. ఓటింగ్ పెట్టాలని లేదా సెలెక్ట్ కమిటీకి పంపాలని ప్రతిపక్షాలు కోరినా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోవడం దుర్మార్గమన్నారు.
రాజ్యసభలో ఎన్డీఏకు పూర్తి మెజారిటీ లేకున్నా... మూజువాణి ఓటుతో ఈ బిల్లు పాస్ చేసుకుందన్నారు. దేశంలోని 60 నుంచి 70 శాతం మంది రైతాంగానికి ఉరితాడు వేసే పద్ధతుల్లో ఈ బిల్లు ఉందన్నారు. వ్యవసాయ రంగాన్ని దెబ్బతీస్తూ కార్పొరేట్ రంగానికి ఊడిగం చేసే పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం తమ విధానాలను అనుసరిస్తుందని ఆక్షేపించారు. ఈ నెల 24న జరిగే జాతీయ స్థాయి నిరసనకు అందరూ ప్రత్యక్షంగా పాల్గొని ఉద్ధృతం చేయాలన్నారు. ఉద్యమాల ద్వారానే ప్రభుత్వానికి సరైనా గుణపాఠం చెప్పాలని నారాయణ తెలిపారు.