సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో గతేడాది నుంచి వైద్యులు చేస్తున్న కృషిని సీపీ అంజనీకుమార్ అభినందించారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొవిడ్ రోగుల సమాచారం కోసం ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ కేంద్రాన్ని... సూపరింటెండెంట్ రాజారావుతో కలిసి సీపీ ప్రారంభించారు. కరోనా రోగుల యోగక్షేమాలు.. వారి ఆరోగ్య పరిస్థితి గురించిన సమాచారం కుటుంబ సభ్యులకు అందజేయడానికే ఈ కేంద్రం ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. కొవిడ్ బాధితుల ఆరోగ్య పరిస్థితిపై అనుమానాలు, ఆందోళనలను కుటుంబ సభ్యులు ఈ హెల్ప్‌డెస్క్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చన్నారు.
గాంధీ ఆస్పత్రి సిబ్బంది, జీహెచ్ఎంసీ, పోలీసుల సమన్వయంతో ఈ హెల్ప్‌డెస్క్ పని చేయనున్నట్లు సీపీ వెల్లడించారు. ప్రస్తుతం కరోనా రెండో దశ కేసుల విజృంభన నేపథ్యంలో ప్రతి ఒక్క రోగి కుటుంబ సభ్యులు సహనం పాటించాలని కోరారు. ప్రజలంతా కరోనా వ్యాప్తి పట్ల అప్రమత్తంగా ఉంటూ... కఠినంగా నిబంధనలు పాటించాలని సూచించారు. హెల్ప్‌డెస్క్‌కు సంబంధించిన రెండు ఫోన్ నంబర్లను రేపు ప్రకటించనున్నట్లు గాంధీ సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు.