హైదరాబాద్‌లో కరోనా పాజిటివ్ వచ్చిన వారంతా గాంధీలో చికిత్స పొందుతున్నారు. వీరితో సన్నిహితంగా ఉన్నవారిని ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. కేసులు నమోదైన ప్రాంతాలను కంటెయిన్‌మెంట్ జోన్లుగా గుర్తించి చర్యలు చేపట్టారు. జీహెచ్‌ఎంసీ, వైద్యారోగ్య, పోలీసు, ఎంటమాలజీ విభాగాల నుంచి ప్రత్యేక నోడల్ అధికారులను నియమించి పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యేక బృందాలతో నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు.
కంట్రోల్ రూమ్ సేవలు..
లాక్‌డౌన్ సందర్భంగా ఏర్పాటు చేసిన బల్దియా కాల్‌సెంటర్‌కు గురువారం 374 కాల్స్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీటిలో రెండు కరోనా అనుమానిత కాల్స్ కాగా... 357 మంది ఆహారం సరఫరా చేయాలని కోరారు. గ్రేటర్ వ్యాప్తంగా 193 అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా 71,680 మందికి మధ్యాహ్న భోజనం, 94 కేంద్రాలతో 40,940 మందికి రాత్రి భోజనం అందించారు.
శివారులో కలకలం..
నగర శివారులోని నందిగామ మండలంలో మరోసారి కలకలం రేగింది. ఇప్పటికే ఈ మండలంలోని చేగూరులో కరోనాతో మహిళ చనిపోగా.. ఆమె భర్త, ఇంట్లో అద్దెకు ఉండే వ్యక్తికి వైరస్ సోకింది. తాజాగా ఇదే మండలంలో ఓ మహిళకు పాజిటివ్ వచ్చింది. ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఆమెకు ఈ నెల 12వ తేదీన కరోనా లక్షణాలు కనిపించడంతో అధికారులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అటునుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు బండ్లగూడ జాగీర్‌లో ఓ కాలనీలో ఇప్పటికే కరోనా సోకిన వ్యక్తి కుటుంబంలో మరో ఇద్దరికి కొవిడ్-19 సోకినట్లు నిర్ధారించారు. దీంతో రంగారెడ్డి జిల్లాలో కేసుల సంఖ్య 50కు చేరుకుంది. జిల్లాలో అధికారులు అప్రమత్తమయ్యారు.
ఇదీ చదవండి: 19న రాష్ట్ర కేబినెట్ సమావేశం... లాక్‌డౌన్ సడలింపుపై తర్జన భర్జన