ఇప్పటికే మద్దతు ధరలో కోతతో ఆందోళన చెందుతున్న పత్తి రైతుపై మరో బాంబ్ విసిరింది భారత పత్తి సంస్థ (సీసీఐ). కొనుగోలు కేంద్రాల్లో రోజుకు 100 నుంచి 800 బేళ్లకు మించి పంటను కొనేదిలేదని స్పష్టం చేసింది. ఎక్కువ మంది రైతులు ఒకేసారి పత్తి తెస్తే కొనడం కష్టమవుతోందని ఈ ఆంక్షలు పెట్టినట్లు సీసీఐ అధికారులు వెల్లడించారు. మరోపక్క కొనుగోళ్లపై ఆంక్షలు, ధరల తగ్గింపుతో రైతులు నష్టాల పాలవుతున్నారు.
భైంసా కేంద్రానికే 1,700 బేళ్ల పరిమితి
మంచిర్యాల, నిర్మల్, కుమురంభీం-ఆసిఫాబాద్ ఆదిలాబాద్ జిల్లాల పరిధిలోని సారంగాపూర్, నార్నూరు, కడెం, కౌటాల, కుభీర్, లక్సెట్టిపేట, ఇందారం కొనుగోలు కేంద్రాలకి రోజుకు 100 బేళ్లు (550 క్వింటాళ్ల)కు మించి పత్తి తెస్తే కొనవద్దని ఆంక్షలు పెట్టింది. ఒక్క భైంసా కేంద్రానికి మాత్రమే 1,700, ఆదిలాబాద్‌కు 1,200 బేళ్లకు అనుమతించింది. మిగతా 22 కేంద్రాలకు కేవలం 100 నుంచి 800 బేళ్లనే కొనాలని స్పష్టం చేసింది.
రూ.4 వేలూ ఇవ్వని వ్యాపారులు
కేంద్రం ఈ ఏడాది క్వింటా పత్తికి రూ.5,825 మద్దతు ధరను నిర్ణయించింది. తెలంగాణలో పత్తి దూదిలో పింజ పొడవు తక్కువగా ఉంటోందని మద్దతు ధరను రూ.100 తగ్గించి రూ.5,725 మాత్రమే ఇవ్వాలని కొనుగోలు కేంద్రాలకు సీసీఐ సూచించింది. ఇప్పటి వరకూ 12 లక్షల టన్నుల పత్తిని కొన్నా ఇందులో సగానికైనా పూర్తిస్థాయిలో రూ.5,725 ఇవ్వలేదు. దూదిలో తేమ ఎక్కువ ఉందని ధర బాగా తగ్గించి కొంటోంది. సీసీఐనే నేరుగా మద్దతు ధరకన్నా తక్కువగా ఇస్తున్నందున వ్యాపారులు మరింత తెగ్గోసి క్వింటాకు రూ.4 వేలూ ఇవ్వడం లేదు. ఇప్పటికే వ్యాపారులు లక్షా 74 వేల టన్నుల పత్తి కొన్నారు. ఇందులో 99 శాతం పంటకు మద్దతు ధర ఇవ్వలేదని ఓ జిన్నింగ్‌మిల్లు వ్యాపారి ‘ఈనాడు-ఈటీవీ భారత్’కు చెప్పారు.
ఆందోళన వద్దు..
ఆంక్షలతో రైతులు వ్యాపారులకు తక్కువ ధరలకు అమ్ముకోవాల్సి వస్తుందని, వచ్చే నెలాఖరు వరకూ ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా మొత్తం పంటను కొనాలని సీసీఐను కోరినట్లు అధికారులు తెలిపారు. కానీ కొత్త మార్కెటింగ్ ఏడాది అక్టోబరు ఒకటినే ప్రారంభమైందని, వచ్చే సెప్టెంబరు వరకూ పత్తిని కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని సీసీఐ వర్గాలు తెలిపాయి. ఇప్పటికిప్పుడు మార్కెట్లకు వెల్లువలా తెస్తే కొనలేం అని, దేశమంతా ఇవే నిబంధనలు అమలు చేస్తున్నట్లు వివరించాయి.
మహారాష్ట్ర నుంచి మరింత రాక..
రాష్ట్ర సరిహద్దు జిల్లాల కొనుగోలు కేంద్రాలకు పత్తిపంటను కర్ణాటక, మహారాష్ట్ర రైతులు, అక్కడి వ్యాపారులు పెద్దఎత్తున అమ్మకానికి తెస్తున్నారు. కొత్త వ్యవసాయ చట్టాలతో దేశంలో ఏ రైతు ఎక్కడైనా తన పంటను అమ్ముకోవచ్చనే వెసులుబాటును వారు వినియోగించుకుంటున్నారు. దీంతో కొనుగోలు కేంద్రాలకు రోజూ గరిష్ఠంగా 100 నుంచి 1,700 బేళ్లకు మించి పత్తి తెస్తే కొనవద్దని తాజాగా ఆదేశాలు జారీచేసింది.
పెట్టుబడీ రాలేదు
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు లస్మారెడ్డి. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం కాప్రి గ్రామంలో 17 ఎకరాల్లో పత్తి సాగుచేశారు. 36 క్వింటాళ్లే దిగుబడి వచ్చింది. క్వింటాకు రూ.3,675 చొప్పునే దక్కింది. దీంతో పెట్టుబడీ రాక నష్టాల పాలయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: సాగు చట్టాల విషయంలో సీఎం యూటర్న్: బండి సంజయ్