Health Card : రాష్ట్రంలో ఉద్యోగులు, పింఛనుదారులు, పాత్రికేయుల ఆరోగ్య పథకం(ఈజేహెచ్‌ఎస్) నామమాత్రంగా కొనసాగుతోంది. అత్యధిక కార్పొరేట్ ఆస్పత్రులు ఈజేహెచ్‌ఎస్ కార్డులను తిరస్కరిస్తున్నాయి. ముందు డబ్బులు కట్టి తర్వాత రియింబర్స్ చేసుకోవాలని సలహా ఇస్తున్నాయి. ప్రభుత్వం తమకు సకాలంలో నిధులు విడుదల చేయడం లేదనీ.. బకాయిలు పేరుకుపోయాయనే సాకుతో ఆసుపత్రుల్లో చేర్చుకోవడానికి నిరాకరిస్తున్నాయి. ఒకవేళ చేర్చుకున్నా తమకు ఏ చికిత్స ద్వారా ఆర్థికంగా ఎక్కువ లబ్ధి చేకూరుతుందో.. వాటికే అనుమతిస్తుండడం గమనార్హం. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందిన ప్రతి సందర్భంలోనూ ఉన్నతాధికారులు తాత్కాలికంగా చొరవ చూపడం.. ఆ తర్వాత పట్టించుకోకపోవడం షరా మామూలు వ్యవహారంగా మారింది.
తొలుత బాగానే ఉన్నా.. తెలంగాణ సర్కారు 2014 నవంబరులో ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని ప్రారంభించింది. 2017లో ఈ పథకం కింద చికిత్సలకు కొత్త ధరలను ఖరారు చేసింది. ఆ తర్వాత ఏడాది పాటు ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో విస్తృతంగా సేవలందించారు. ఒక్క కార్పొరేట్ ఆసుపత్రుల్లోనే తీసుకుంటే.. 2016-17లో 5 వేల చికిత్సలు చేయగా.. ఆ మరుసటి సంవత్సరంలో దాదాపు ఐదింతలు(27 వేలకు పైగా) పెరిగాయి. ఆ తర్వాత కాలంలో నిధుల విడుదలలో జాప్యాన్ని కారణంగా చెబుతూ.. ఆస్పత్రులు క్రమేణా నిరాకరిస్తూ వస్తున్నాయి. 2018-19లో 18 వేలకు తగ్గిన చికిత్సలు.. 2019-20లో ఏకంగా 13 వేలకు చేరాయి. గత రెండేళ్లుగా మరింత తగ్గిపోయాయి.
- ఇదీ చదవండి : ఆస్పత్రుల్లో వారికి రూ.5 కే భోజనం.. నేడే ప్రారంభం
కొన్ని చికిత్సలకే పరిమితం : మొత్తం చికిత్సలను నిరాకరిస్తే ప్రభుత్వానికి తెలిసిపోతుందని భావిస్తున్న కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు.. తమకు లాభసాటిగా ఉన్న వాటికి అనుమతిస్తూ సరికొత్త ఎత్తుగడలకు పాల్పడుతున్నాయి. ఔషధ చికిత్సలు, జనరల్ సర్జరీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ.. తదితర విభాగాలకు సంబంధించిన కేసులు తక్కువగా.. గుండె రక్తనాళాల్లో స్టెంట్లు, మూత్రపిండాల్లో రాళ్లు, క్యాన్సర్‌కు రేడియేషన్.. తదితర చికిత్సలకు ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నాయి. ఇలాంటి ఎత్తులు తెలియని రోగులు.. ఆసుపత్రులకొచ్చి తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. అయితే, తమకు సుమారు రూ.250 కోట్ల వరకూ బకాయిలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని తెలంగాణ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం ప్రతినిధి ఒకరు తెలిపారు. సకాలంలో నిధులు విడుదల చేయడంతోపాటు.. పథకం సజావుగా కొనసాగేలా ప్రత్యేక అధికారిని నియమించాలని కోరారు.
ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి గుండెజబ్బు వచ్చింది. హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యుడిని సంప్రదిస్తే చికిత్సకు రూ.3.5 లక్షలవుతాయని చెప్పారు. ఉద్యోగుల ఆరోగ్య కార్డు ఉందని చూపించినా నగదు రహిత చికిత్స వీలుకాదని తేల్చిచెప్పారు. దీంతో మొత్తం డబ్బు కట్టి చికిత్స పొందాల్సి వచ్చింది.
ఓ స్టాఫ్‌నర్సు తండ్రికి గుండెపోటు రాగా.. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని వైద్యులు చెప్పారు. సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిని సంప్రదిస్తే ఉద్యోగుల ఆరోగ్య కార్డుతో చికిత్స అందించడం లేదనీ.. ముందుగా డబ్బు కట్టి రియింబర్స్‌మెంట్ చేసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. గత్యంతరం లేక రూ.5.25 లక్షలు కట్టి చికిత్స పొందారు.
మా వాటా స్వీకరించండి : ఆరోగ్య కార్డుల అమలు కోసం ఉద్యోగుల మూల వేతనం నుంచి ఒక శాతం ఇవ్వాలని పీఆర్‌సీ కమిటీ నివేదికలో సూచించిందనీ.. తాము 2 శాతాన్ని వాటాగా ఇస్తామని, స్వీకరించాలని టీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలోని అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావుకు బుధవారం టీఎన్‌జీవో ప్రతినిధులు వినతిపత్రాన్ని అందజేశారు. త్వరలోనే ఉత్తర్వులు జారీ అయ్యేలా చూస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. ఈ పథకం సక్రమంగా అమలయ్యేలా చూడాలని వైద్య ఆరోగ్య శాఖ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు జూపల్లి రాజేందర్ కోరారు.
- ఇదీ చదవండి : దేశద్రోహం చట్టం అమలుపై సుప్రీంకోర్టు స్టే