లాక్‌డౌన్ తర్వాత హైదరాబాద్ నగరానికి వలసలు పెరిగాయి. మహారాష్ట్ర, బిహార్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ్‌బంగ తదితర రాష్ట్రాల నుంచి పనుల నిమిత్తం కూలీలు భాగ్యనగరం బాట పడుతున్నారు. ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే ప్రత్యేక రైళ్లు కిటకిటలాడుతున్నాయి. నిత్యం వందలాది మంది సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకొని అక్కడ నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళుతున్నారు. గతేడాది మార్చిలో లాక్‌డౌన్ తర్వాత నిర్మాణ, పారిశ్రామిక రంగాలు పూర్తిగా స్తంభించిపోయాయి. కుటీర పరిశ్రమ నుంచి అన్ని మూతపడ్డాయి. వేలాది మంది సొంతూళ్లకు వెళ్లిపోయారు.
నెమ్మదిగా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతోపాటు లాక్‌డౌన్ ఎత్తివేయడం మళ్లీ వ్యాపార, వాణిజ్య, నిర్మాణ, పారిశ్రామిక రంగాలు ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నాయి. ఈ తరుణంలో వెనక్కి వెళ్లిన వారంతా తిరిగి నగరానికి చేరుకుంటున్నారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని నిపుణులు చెబుతున్నారు. కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
కొవిడ్ లక్షణాలు కన్పించినా సరే.. వెంటనే పరీక్షలకు పంపడం మేలని సూచిస్తున్నారు. దీనివల్ల మిగతా వారికి సోకకుండా నియంత్రిచవచ్చని సూచిస్తున్నారు. పని ప్రదేశంతోపాటు హోటళ్లు, రెస్టారెంట్లలో కొవిడ్ జాగ్రత్తలపై నిర్లక్ష్యం చూపుతున్నారు. చాలా షాపింగ్ మాల్స్‌లో థర్మల్ స్క్రీనింగ్ పాటించడం లేదు. ఎడం పాటించడం లేదు. మెహిదీపట్నం, అమీర్‌పేట, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, అబిడ్స్, చార్మినార్, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీనగర్ తదితర ప్రాంతాల్లో జనం కిక్కిరిసి కనిపిస్తున్నారు. ప్రతి పది మందిలో ఇద్దరు, ముగ్గురు మాత్రమే మాస్క్‌లు ధరిస్తున్నారు. గత వారం రోజులుగా గ్రేటర్‌లో కొవిడ్ కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. మృతుల సంఖ్య కూడా అలాగే ఉంది. ఈ నేపథ్యంలో ఎవరికి వారు స్వీయ భద్రతపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులు..
గాంధీ 57
కింగ్‌కోఠి 51
టిమ్స్ 67
- ఇదీ చూడండి : రాష్ట్రంలో అనూహ్యంగా పెరుగుతున్న పన్నుల ఆదాయం