కరోనా మహమ్మారి రోజురోజుకీ విజృంభిస్తోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నిత్యం వందల సంఖ్యలో నమోదవుతున్నాయి. బుధవారం నాడు రాష్ట్రంలో 891 మందికి కరోనా నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 10,444కి చేరింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 67,318మందికి పరీక్షలు నిర్వహించగా... అందులో 56,874మందికి నెగెటివ్ వచ్చిందని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
గురువారం నమోదైన కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్లోనే 719 ఉన్నాయి. రంగారెడ్డిలో 86మందికి, మేడ్చల్లో 55, భద్రాద్రి కొత్తగూడెంలో 6, ఖమ్మం 4, వరంగల్ రూరల్లో 3, సంగారెడ్డి, కరీంనగర్, నల్గొండ 2, కామారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, గద్వాల్, పెద్దపల్లి, సూర్యాపేట, నిజామాబాద్, మహబూబాబాద్, ఆదిలాబాద్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. తాజాగా 137మంది కోలుకొని ఇళ్లకు వెళ్లగా... ఇప్పటి వరకు 4,361 మంది డిశ్చార్జయ్యారు. తాజాగా 5మృతి చెందగా... ఇప్పటి వరకు 225మంది మృతి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.
ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో 10,444మందికి కరోనా నిర్ధారణ కాగా ఇందులో 50 శాతానికి పైగా కేసులు లాక్డౌన్ సడలింపుల తర్వాతే నమోదు కావటం ఆందోళన కలిగిస్తోంది. ఇక జూన్ 1 నుంచి లాక్డౌన్ సడలింపులు ప్రారంభం కాగా... అప్పటి నుంచి బుధవారం నాటికి రాష్ట్రంలో 7,746 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. అంటే దాదాపు 60శాతం కేసులు గడచిన 24రోజుల్లో నమోదు కావటం గమనార్హం. ఇక జీహెచ్ఎంసీ పరిధిలోనే ఏకంగా 6,952 పాజిటివ్ కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదు కావటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ సహా పరిసర జిల్లాల్లో ప్రభుత్వం 50వేల కరోనా పరీక్షలు చేసే ప్రక్రియ ప్రారంభించిన నాటి నుంచి రాష్ట్రంలో భారీగా కేసులు పెరుగుతున్నాయి.
మొత్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులు పూర్తిగా ఇళ్లకే పరిమితం కావాలని వైద్య ఆరోగ్యశాఖ సూచిస్తోంది. మరోవైపు ఇళ్ల నుంచి బయటకు వచ్చేప్పుడు తప్పక మాస్కులు ధరించటంతోపాటు... శానిటైజర్లు, లేక సబ్బునీటితో తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలని చెప్తోంది.
ఇదీ చూడండి: హరితహారానికి 'ఆరో' మెట్టు.. నేడే శ్రీకారం