కరోనా బాధితులకు ఆరోగ‌్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో అందించే చికిత్సకు సంధించిన ఫీజుల్ని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్యశాఖ ఖరారు చేసింది. ఇప్పటికే కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చిన ఏపీ ప్రభుత్వం.. ఫీజుల నిర్ధరణపై ఉన్నతస్థాయి సాంకేతిక కమిటీ ప్రతిపాదించిన ఫీజులను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బాధితులకు అందించే వైద్యం ఆధారంగా రోజువారీ ఫీజులను కనిష్టంగా రూ.3250, గరిష్ఠంగా రూ.10,380గా నిర్ధరించారు. ఈ మొత్తాన్ని.. రోగుల తరపున ఆరోగ్యశ్రీ ట్రస్టు చెల్లించనుంది.
ఫీజుల వివరాలు
- వైౖరస్ సోకినా...ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేని వారికి చికిత్స అందిస్తే.. రోజుకు: రూ.3,250
- ఐసీయూలో ఉన్నా...వెంటిలేటర్ అవసరం లేకుంటే: రూ.5,480
- ఐసీయూతోపాటు ఎన్‌ఐవీ (నాన్ ఇమేజివ్ ఇన్వెస్టిగేషన్) కలిపి: రూ.5,980
- ఐసీయూలో వెంటిలేటరుతో ఉంటే: రూ.9,580
- ఐసీయూలోనే ఉంటూ ఆరోగ్యం బాగా క్షీణించిన వారికి వెంటిలేటర్ అవసరం లేకుండా చికిత్స అందిస్తే: రూ.6,280.
- వెంటిలేటర్ సాయం అవసరమైతే: రూ.10,380.
- ఆరోగ్యం ఇంకా క్షీణిస్తే: రూ.10,380.
నిర్దేశిత ఫీజులు
ఆరోగ్యశ్రీ పరిధిలో లేని ఆస్పత్రుల్లో రోగులు చేరితే.. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులనే వసూలు చేయాలని ఏపీ వైద్యారోగ్యశాఖ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. నోటీసు బోర్డుల్లో ఫీజుల వివరాలను స్పష్టంగా ప్రకటించాలని ఆదేశించింది. నాన్-ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లో అదనంగా రోజుకు ప్రైవేట్ రూం కింద రూ.600. పీపీఈ కిట్లు, వైరస్ నిర్ధరణ పరీక్షలకు చెల్లించే ఫీజులు వేరుగా ఉంటాయి.
ఇదీ చదవండి : రమేశ్ ఆసుపత్రికి అచ్చెన్నాయుడు.. పోలీసుల భారీ బందోబస్తు