ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. బుధవారం ఉదయానికి 73 కేసులు పాజిటివ్‌గా తేలడం వల్ల రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1332కి చేరింది. కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఇంకా అదే ఒరవడి కొనసాగుతోంది. గుంటూరు జిల్లాలో బుధవారం 29 మందికి, కృష్ణాలో 13 మందికి, కర్నూలులో 11 మందికి పాజిటివ్‌గా తేలింది. కర్నూలులో ఇప్పటికే 300 కేసులు దాటిపోగా.. గుంటూరు 300కు దగ్గర అవుతోంది. కృష్ణాలో 200 కేసులు దాటిపోయాయి.
రాష్ట్రంలో మరే జిల్లాలోనూ వంద వరకు రాలేదు. దీన్నిబట్టి రాష్ట్రంలో ఈ 3 జిల్లాల్లో కొవిడ్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. బుధవారం విజయనగరం, నెల్లూరు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటికీ విజయనగరం జిల్లా ఒక్కటే రాష్ట్రంలో కరోనాకు దూరంగా ఉంది. బుధవారం నాటికి మరో 7,727 నమూనాలు పరీక్షించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
గడిచిన 3 రోజులుగా రాష్ట్రంలో కరోనాతో ఎవరూ మరణించలేదు. మొత్తం మృతుల సంఖ్య 31. బుధవారం కొత్తగా మరణాలు సంభవించలేదని ప్రభుత్వం ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో 29 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ఇప్పటి వరకు ఇలా కోలుకున్న వారి సంఖ్య 287.