మారుతి పుట్టిన ప్రాంతంగా ఏపీ తిరుమల కొండల్లోని అంజనాద్రిని తితిదే ప్రకటించటంపై.. పంపాక్షేత్ర కిష్కింధకు చెందిన హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. కొన్ని శతాబ్దాలుగా కిష్కింధయే హనుమంతుడి జన్మభూమి అంటూ వస్తున్న సంప్రదాయాన్ని కాలరాస్తూ తితిదే వ్యాఖ్యానాలు చేస్తోందని ఆ ట్రస్ట్ ఫౌండర్ ట్రస్టీ గోవిందానంద ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుగిరుల్లో అంజనాద్రే హనుమ జన్మస్థలంగా చూపించేందుకు శాసన, వాంజ్ఞ్మయ, భౌగోళిక, పౌరాణిక ఆధారాలంటూ తితిదే పండిత కమిటీ చూపిస్తున్న విషయాలకు.. ప్రామాణికత లేదని మరో మారు తేల్చిచెప్పారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన.. తితిదే పండిత కమిటీలోని సభ్యులకు భాష, వ్యాకరణంపై ఉన్న పరిజ్ఞానం తనకు లేకపోయినా.. విశ్వాసానికి ఏది ప్రమాణంగా తీసుకోవాలనే అవగాహన తమకు ఉందన్నారు.
తితిదే పండిత పరిషత్ అచ్చు వేయించిన పుస్తకంలో మారుతి జన్మస్థలానికి ఆధారంగా ఉటంకించిన శ్లోకాలను.. వాటి ప్రమాణాన్ని గోవిందానంద తోసిపుచ్చారు. శ్రీ వేంకటేశ్వర మహత్మ్యానికే సర్వత్రా సమ్మతి లేదన్న గోవిందానంద.. అందులో చాలా సంకలనాలు ఉన్నాయన్నారు. పరమ ప్రామాణికమైన వాల్మీకి రామాయణం మాత్రమే ఆంజనేయుడి వృత్తాంతానికి ప్రాతిపదిక అన్నారు. కిష్కింధకాండ అంటూ వాల్మీకి విరంచించిన రచన అంతా పంపాక్షేత్ర కిష్కింధ ప్రాంతానికే సొంతమన్నారు. ఏ రచనల ఆధారంగా తితిదే పండిత కమిటీ పుస్తకం తీసుకువచ్చిందో.. అదే రచయితలు 8 నెలల నుంచి తమను కలిసి ఆమోదముద్ర వేయించుకునేందుకు నిరీక్షిస్తున్నారన్నారు. స్తోత్రాలు, శ్లోకాలను తమకు అనుకూలంగా అన్వయించుకుంటూ తితిదే పండిత కమిటీ.. అనవసర చర్చకు తెర తీసిందని గోవిందానంద సరస్వతి ఆక్షేపించారు. ఇరుపక్షాల వాదప్రతివాదాలతో అంజనీసుతుడి జన్మస్థలంపై మొదలైన వివాదం.. మరింత కాలం కొనసాగే అవకాశమే కనిపిస్తోంది.
ఇదీ చదవండి :