వర్షాలు పడి వైర్లు తెగిపోతే ఎవరికి ఏమైనా తమ బాధ్యత లేదని విద్యుత్ సంస్థలు భావించడం కుదరదని ఆంధ్రప్రదేశ్ వినియోగదారుల కమిషన్ స్పష్టం చేసింది. సంపాదించే వ్యక్తిని విద్యుత్ షాక్‌తో కోల్పోయిన కుటుంబానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఏపీలోని విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం పాచలవలస నివాసి జి.సత్యనారాయణ(29) 2016లో రాత్రి వేళ ఇంటికి వెళ్తుండగా రహదారిపై తెగి పడి ఉన్న విద్యుత్ వైరు తగిలి గాయాలపాలై ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మరణించారు. బురిజివలస పోలీసులు కేసు నమోదు చేశారు. కూలీ పనులకెళ్లే సత్యనారాయణపై భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు ఆధారపడ్డారు. విద్యుత్ శాఖ (ఏపీఈపీడీసీఎల్) నిర్లక్ష్యం వల్లే సత్యనారాయణ చనిపోయారని, పోషించే వ్యక్తిని కోల్పోయామని, పరిహారం చెల్లించాలని బాధిత కుటుంబం విద్యుత్ శాఖకు లీగల్ నోటీసులు పంపింది. వాటికి విద్యుత్ శాఖ స్పందించలేదు. దీంతో విజయనగరం జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించింది.
‘సంఘటన జరిగిన నాడు పెద్ద వాన కురిసింది. ఊళ్లో వినాయక నిమజ్జన ఊరేగింపు జరుగుతోంది. వాన వల్ల తెగిపడిన విద్యుత్ వైరును ట్రాక్టరులో అక్కడికొచ్చిన సత్యనారాయణ నిర్లక్ష్యంగా పట్టుకున్నారు. దీంతో ఆయన చనిపోయారు. దీంట్లో మా నిర్లక్ష్యమేమీ లేదు’ అని విద్యుత్ సంస్థ వాదించింది.
సాక్ష్యాధారాలు పరిశీలించిన జిల్లా కమిషన్ విద్యుత్ సంస్థ తరఫున సేవాలోపం ఉందని నిర్ధారించింది. బాధిత కుటుంబానికి రూ.6.88 లక్షలు పరిహారమివ్వాలని ఆదేశించింది. ఈ తీర్పును విద్యుత్ సంస్థ ఏపీ కమిషన్‌లో సవాలు చేసింది. వాదనలు విన్న ఏపీ కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ టి.సునీల్‌చౌదరి, సభ్యుడు పి.ముత్యాలనాయుడు కూడా జిల్లా కమిషన్ తీర్పునే సమర్థించారు. ఈ సంఘటనలో విద్యుత్ సంస్థ నిర్లక్ష్యం కనిపిస్తోందని, షాక్‌తో ఎవరైనా మృతి చెందితే పరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: Afghan news: 'దానర్థం.. తాలిబన్ల పాలనను గుర్తిస్తామని కాదు'