దేశంలో భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా రాజ్ భవన్ ఎదుట సోమవారం నిరసన ప్రదర్శన చేయనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఏఐసీసీ పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రాజస్థాన్ గవర్నర్ అనుసరిస్తున్న తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్ని రాష్ట్రాల రాజ్‌భవన్‌ల వద్ద నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చినట్లు ఉత్తమ్ తెలిపారు. రాజ్‌భవన్ వద్ద ఈరోజు ఉదయం 11 గంటలకు నిరసన కార్యక్రమం ఉన్నందున 10 గంటల లోపు ముఖ్య నాయకులంతా గాంధీభవన్ చేరుకోవాలని ఉత్తమ సూచించారు.కొవిడ్ నియమ నిబంధనలకు లోబడే నిరసన కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేశారు.
పోలీస్ శాఖ ముందస్తు చర్యలు..
హస్తం నేతల నిరసన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీస్ శాఖ ముందస్తు చర్యలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. నగరంలోని కాంగ్రెస్ ముఖ్య నాయకుల ఇళ్ల వద్ద పోలీసులు మోహరించే అవకాశం ఉంది. రాజ్‌భవన్ వద్ద నిరసన కార్యక్రమంలో పాల్గొనకుండా ముఖ్య నాయకులను గృహనిర్బంధం చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కొందరు కాంగ్రెస్ నాయకులు తమ మకాం మార్చినట్లు తెలుస్తోంది.
ఇవీ చూడండి: 'భాజపా కుట్రలను ప్రజలు తిరస్కరిస్తారు'