ముస్లీంలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తానన్న కేసీఆర్ హామీ మాటలకే పరిమితం అయిందని కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. మైనార్టీల పక్షాన కాంగ్రెస్ పోరాటం ప్రారంభమైందని నేతలు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద పీసీసీ మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో మైనార్టీ గర్జన సభ నిర్వహించారు. ఈ సభలో రాష్ట్ర కాంగ్రెస్ మైనార్టీ విభాగం ఛైర్మన్ సాహెల్, మాజీ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, వర్కింగ్ ప్రెసిడెంట్ గీతా రెడ్డి.... పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు, యువజన కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌తోనే మైనార్టీలకు మేలు...
"కాంగ్రెస్ హయాంలోనే మైనార్టీలకు మేలు జరిగింది. కాంగ్రెస్ పార్టీ మీదే.. పార్టీని నిలబెట్టే బాధ్యతా మీదే. కారునో.. పతంగినో నమ్ముకుంటే మోసపోయేది మీరే. మోదీకి వ్యతిరేకంగా పోరాడే శక్తి.. కాంగ్రెస్‌కే ఉంది. మోదీకి మద్దతుగా నిలిచే కేసీఆర్ పార్టీని ఓడించాలి. తెరాసకు వేసే ఓటు భాజపాకు వెళ్తోంది. ఎస్సీల కంటే ముస్లింలు వెనకబడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే మైనార్టీలకు విద్య, ఉపాధి అవకాశాలు. ప్రతి ముస్లిం కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షలు ఇవ్వాలి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మైనార్టీలకు బడ్జెట్. వక్ఫ్ బోర్డు, జ్యుడీషియరీ పవర్స్ కల్పిస్తాం." - రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
తెరాస, భాజపాల మధ్య ఒప్పందం..
"కేసీఆర్ పాలనలో మైనార్టీలు దగాకు గురైయ్యారు. 12 శాతం రిజర్వేషన్ ఇస్తానన్న కేసీఆర్ హామీ అమలు కాలేదు. మోదీతో మాట్లాడానని... 12 శాతం రిజర్వేషన్ అమలు చేస్తానని కేసీఆర్ అసెంబ్లీలో చెప్పారు. ఇప్పటి వరకు అమలు చేయలేదు. ముస్లింలు తెరాసను నమ్మొద్దు. భాజపా, తెరాసల మధ్య లోపాయకారి ఒప్పందం ఉంది. వాళ్లిద్దరిదీ గల్లీలో కుస్తీ.. దిల్లీలో దోస్తీ. మైనార్టీల అభ్యున్నతికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది. దేశంలో మతతత్వ రాజకీయాలతో భాజపా లబ్ది పొందాలని చూస్తోంది. మోదీ పాలనలో మైనార్టీలు అభద్రతలో ఉన్నారు. మైనార్టీలు భాజపాకు బుద్ధి చెప్పాలంటే రాష్ట్రంలో తెరాసను గద్దె దించాలి. కేసీఆర్ అన్ని విషయాల్లో భాజపాకు మద్దతు ఇస్తున్నాడు. వక్ఫ్ బోర్డు ఆస్తుల విషయంలో కేసీఆర్ ఏం చేయట్లేదు. కాంగ్రెస్ ఎప్పుడు మైనార్టీలకు అండగా ఉంటుంది." - ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ
పోరాటం ఆగదు...
"మైనార్టీల పక్షాన పోరాటానికి కాంగ్రెస్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తానన్న కేసీఆర్ హామీ.. మాటలకే పరిమితమైంది. మైనార్టీల పక్షాన కాంగ్రెస్ పోరాటం ప్రారంభం అయ్యింది. కేసీఆర్‌ను గద్దె దించేవరకు పోరాటం ఆగదు. భవిషత్తులో ఇలాంటి మైనార్టీ గర్జనలు మరిన్ని జరగాలి. ముందు ముందు జరిగే మైనార్టీ గర్జన కార్యక్రమాలకు నా సహకారం ఉంటుంది" - జగ్గారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే
ముస్లిం బంధు కూడా ఇవ్వాలి...
"అన్ని కులాలు, మతాలకు ఫ్రెండ్లీ పార్టీ కాంగ్రెస్. మైనార్టీల్లో చాలా మంది పేదరికంలో ఉన్నారు. దళిత బంధు మాదిరిగా ముస్లిం బంధు కూడా కేసీఆర్ సర్కార్ ఇవ్వాలి. 12 శాతం రిజర్వేషన్ హామీ అమలు చేయాలి. లేకుంటే కాంగ్రెస్ పక్షాన కార్యాచరణ చేపడతాం. బాబ్రీ మసీదు కూల్చివేత తరువాత ముస్లింలు కాంగ్రెస్‌కు దూరం అయ్యారు. మళ్లీ ముస్లింలను దగ్గరికి చేర్చుకునే ప్రణాళికలు రచించాలి. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక పార్టీకి కొత్త ఊపు వచ్చింది." - చిన్నారెడ్డి, మాజీ మంత్రి
ఇదీ చూడండి:
NHRC: తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై ఎన్‌హెచ్చార్సీ ఆగ్రహం