ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఈ నెల 9న జరగనున్న దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరాకు కాంగ్రెస్ శ్రేణులంతా తరలి వచ్చి విజయవంతం చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా మాజీ ఎమ్మెల్సీ ప్రేమసాగర్‌రావు, ఎమ్మెల్యే శ్రీధర్ బాబులతో భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. ఇంద్రవెల్లి సభకు జరుగుతున్న ఏర్పాట్లపై చర్చించారు. లక్ష మందితో సభ నిర్వహించనుండటం వల్ల ఎక్కడెక్కడ నుంచి ఎంత మంది రావచ్చు..? వారిని ఏ విధంగా సమీకరణ చేస్తున్నారు..? తదితర అంశాలను ప్రేమ్‌సాగర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకుడైన ప్రేమ్‌సాగర్... సీఎల్పీ బృందమంతా సభకు రావాల్సిందిగా మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.
కాంగ్రెస్ ఇచ్చిన రిజర్వేషన్ల వల్లే..
దళిత, గిరిజనులను మోసం చేసి నష్టం చేసిన కేసీఆర్‌కు బుద్ధి చెప్పేందుకే ఇంద్రవెళ్లిలో సభ నిర్వహిస్తున్నట్లు పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి స్పష్టం చేశారు. ఈ నెల 9న ఇంద్రవెల్లిలో జరిగే దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరాను విజయవంతం చేసేందుకు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులతో సమావేశమయ్యారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యాక మొదటిసారి దళిత, గిరిజన దండోరా కార్యక్రమాన్ని చేపట్టడం హర్షనీయమన్నారు.
"కాంగ్రెస్ పార్టీ హయాంలో దళిత, గిరిజనుల హక్కులను కాపాడేందుకు వాళ్లకు అన్ని రంగాలలో రిజర్వేషన్లు ఇచ్చాం. విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్లు ఇవ్వడం వల్లే.. ఇవాళ లక్షలాది మంది ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. కనీసం ఓటు హక్కు కూడా లేని పరిస్థితి నుంచి ఏకంగా రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలా అన్ని రంగాలలో దళిత, గిరిజన ప్రజలు అభివృద్ధి చెందారు. ఇంద్రవెల్లి సభకు రాజకీయాలకు అతీతంగా తరలి వచ్చి మద్దతివ్వాలి." - మల్లు రవి, పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు
భూమితోనే ఆత్మగౌరవం...
ఇంద్రవెల్లి దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభను విజయవంతం చేయాలని రంగారెడ్డి జిల్లా కార్యకర్తలకు ఎల్బీనగర్ మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సూచించారు. ఇంద్రవెల్లి సభ అంశంపై ఇందిరాభవన్‌లో డీసీసీ అధ్యక్షుడు నరసింహారెడ్డి అధ్యక్షతన జిల్లా కాంగ్రెస్ నాయకుల సమావేశం జరిగింది.
"ఇంద్రవెల్లి సభను విజయవంతం చేయడానికి అంతా కలిసికట్టుగా కృషి చేయాలి. ఏడేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్, ఫామ్‌హౌస్‌లకు పరిమితమయ్యారు. ఇపుడు జనం మధ్యకు వస్తున్నారు. దళిత, గిరిజనులు ఆత్మగౌరవంతో బతకాలంటే వారికి భూమి ఇవ్వాలి. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షులైన తరువాత కేసీఆర్‌కు భయం పుట్టింది. నిద్ర కూడా పట్టడం లేదు. దళిత బంధు ఇస్తామని ముందుకు వస్తున్న సీఎం కేసీఆర్... దానిని రాష్ట్రమంతా అమలు చేయాలి." -మల్రెడ్డి రంగారెడ్డి, ఎల్బీనగర్ మాజీ ఎమ్మెల్యే
ఇదీ చూడండి: