తెలంగాణ రాష్ట్ర పీసీసీని(Tpcc working committee పటిష్ఠం చేయడంపై ఏఐసీసీ దృష్టి సారించింది. 2023 సాధారణ ఎన్నికల నాటికి రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు క్షేత్ర స్థాయి నుంచి పోరాడాలని ఇటీవల ఏఐసీసీ స్పష్టం చేసింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితోపాటు సీనియర్ ఉపాధ్యక్షులు, మూడు కమిటీలు, రాజకీయ వ్యవహారాల కమిటీని ప్రకటించిన ఏఐసీసీ... పీసీసీ ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు నియామక ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీనియర్ నాయకులతో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్కం ఠాగూర్ చర్చించారు. పార్టీకి విధేయులుగా పని చేస్తున్న నాయకులను ఏదో ఒక పదవిలో నియమించి వారి అనుభవాలను పార్టీ బలోపేతానికి వినియోగించుకోవాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది.
దారిలోకి తెచ్చుకునేందుకు..
ప్రధానంగా రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడి(Tpcc working committeeగా నియమితులైన తరువాత పలువురు సీనియర్లు అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే వారిలో చాలా మందిని బుజ్జగించారు. పార్టీకి వ్యవతిరేకంగా మాట్లాడకపోయినా.... కోమటిరెడ్డి సోదరులు, మర్రి శశిధర్ రెడ్డిలతోపాటు పలువురు దూరంగా ఉంటున్నారు. రేవంత్ రెడ్డితో కలిసి పని చేయడానికి కొందరు నాయకులు చొరవ చూపడం లేదని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీ అధిష్ఠానం వారందర్ని దారిలోకి తెచ్చుకునే పనిలో నిమగ్నమైంది.
వాళ్ల సమస్యేంటి?
పీసీసీ(Tpcc working committeeతో కలిసి పనిచేయడానికి సుముఖత చూపని వారెవరు? దానికి గల కారణాలేంటి? వాళ్లేం ఆశిస్తున్నారు? వంటి వివరాలు సేకరించిన అధిష్ఠానం.. వారికి ఏ బాధ్యతలు అప్పగిస్తే పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుందోనన్న అంశంపై అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. మూడు రోజుల కిందట రాజకీయ వ్యవహారాల కమిటీని వేసిన ఏఐసీసీ... అందులో దాదాపు అందరికి స్థానం కల్పించారు.
ఖాళీలు.. భర్తీ...
మాజీ మంత్రులు మర్రి శశిధర్ రెడ్డి, చిన్నారెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి లాంటి వారు మరికొందరు మిగిలిపోయారు. కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న కోదండ్ రెడ్డి ఇటీవలే పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఆ పోస్టు ఖాళీ అవ్వడం వల్ల ఆ స్థానంలో మాజీ మంత్రి చిన్నారెడ్డిని భర్తీ చేయాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీలో చేరికలకు సంబంధించి చర్చించిన తరువాతే కాంగ్రెస్ కండువా కప్పాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ఓ కమిటీ ఏర్పాటు చేసి దానికి పొన్నాల లక్ష్మయ్యను ఛైర్మన్ చేయాలనే యోచనలో ఉన్నట్లు హస్తం వర్గాలు చెబుతున్నాయి.
కొలువుదీరనున్న పీసీసీ కార్యవర్గం..
మర్రి శశిధర్ రెడ్డి ఇప్పటి వరకు పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ ఛైర్మన్‌గా పని చేసినందున...ఆయనకు ఏ పదవి ఇస్తే బాగుంటుందన్న కోణంలో ఏఐసీసీ పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఈ రెండు కమిటీలతోపాటు పీసీసీ కార్యవర్గాన్ని(Tpcc working committee పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్లు పీసీసీ వర్గాలు వెల్లడించాయి.