పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ చలో రాజ్ భవన్ కార్యక్రమానికి పిలుపునివ్వడంతో రాజ్‌భవన్ వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. రాజ్‌భవన్ వైపు కాంగ్రెస్ శ్రేణులు దూసుకురాకుండా బారికేడ్లు, ఇనుప ముళ్ల కంచె ఏర్పాటు చేయడంతో పాటు రోప్ పార్టీ సిద్ధం చేశారు. ఇందిరా పార్కు నుంచి వెళ్లే వాహనాల రాకపోకలను దారి మళ్లించారు.
పెద్దఎత్తున తరలివస్తోన్న శ్రేణులు..
పార్టీ పిలుపు మేరకు ఇందిరా పార్కు ధర్నా చౌక్‌కు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివస్తున్నాయి. ఇందిరా పార్కు నుంచి రాజ్‌భవన్‌కు ర్యాలీగా వెళ్లి గవర్నర్‌కు వినతిపత్రం ఇవ్వాలని కాంగ్రెస్ భావించినప్పటికీ.. పోలీసులు ర్యాలీకి అనుమతి ఇవ్వలేదు. ధర్నా చౌక్ వద్ద మధ్యాహ్నం రెండు గంటల వరకు కేవలం 200 మందితో సమావేశానికి మాత్రమే అనుమతి ఇచ్చింది. కాంగ్రెస్ శ్రేణులు రాజ్ భవన్‌కు వెళ్లకుండా ఇందిరా పార్కు పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను గృహనిర్బంధం చేస్తున్నారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు.
పోలీసులను తప్పించుకుని...
ఉదయం నుంచే కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది రాజ్‌భవన్ దగ్గరకు వచ్చేందుకు యత్నించగా... పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పటాన్చెరు నుంచి వచ్చిన ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలు... రాజ్‌భవన్ వైపు దూసుకొచ్చారు. పోలీసులను తప్పించుకుని వచ్చిన కార్యకర్తలు కాంగ్రెస్ జెండాలతో రాజ్‌భవన్ గేటు వద్దకు చేరుకున్నారు. తమతో పాటు తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ జెండాలను రాజ్‌భవన్ గేటుకు కట్టి... నినాదాలు చేశారు.
అక్రమ అరెస్టులు నియంతృత్వం: మల్లు రవి
చలో రాజ్‌భవన్ కార్యక్రమానికి వస్తున్న నేతలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని.. అది నియంతృత్వమని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి మండిపడ్డారు. జిల్లాల నుంచి కార్యకర్తలు రాకుండా అడ్డుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరాపార్కు వద్ద ధర్నా చేసేందుకు అనుమతి ఇచ్చిన పోలీసులు.. ఇలా గృహ నిర్బంధాలు, అరెస్టులు చేయడం రాచరిక పాలకకు నిదర్శనమని ఆక్షేపించారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
చలో రాజ్‌భవన్‌ను విజయవంతం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి... శ్రేణులకు పిలుపునిచ్చారు. అనుమతినివ్వకపోవటాన్ని ఖండించారు. ఒకవేళ కాంగ్రెస్ శ్రేణుల్ని పోలీసులు అడ్డుకుంటే.. పోలీసుస్టేషన్లు ముట్టడిస్తామని హెచ్చరించారు.