ముందు చూపుతో కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఐటీఐఆర్ పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాశనం చేశాయని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో ఎంతో శ్రమించి 18 కేంద్ర ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు తెచ్చినట్లు ఆయన తెలిపారు. అలాంటి ఐటీఐఆర్ పథకాన్ని రద్దు చేయడం అత్యంత దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో 50 వేల ఎకరాల భూ సేకరణ, 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు, ప్రత్యక్ష, పరోక్షంగా 65.5 లక్షల ఉద్యోగాలు వచ్చే ఐటీఐఆర్ పథకంతో తెలంగాణ రూపురేఖలు మారిపోయేవని పేర్కొన్నారు.
రాష్ట్రంలో నిరుద్యోగం, ఉపాధి లేమి అనే మాటలే ఉండక పోయేవని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏడేళ్ల పాటు తెరాస ప్రభుత్వం చేసిన నిర్లక్షానికి యువత బలైపోయిందని ఆరోపించారు. 2018లోనే ఈ పథకాన్ని రద్దు చేశామని కేంద్రం చెబుతోందని... ఈ ప్రభుత్వానికి ఆ పథకం రద్దు చేసిన విషయం కూడా తెలియదా అని ప్రశ్నించారు. కేంద్రం తెలంగాణతో ఎలాంటి సంప్రదింపులు లేకుండా అభివృద్ధి చెందిన ఆ ప్రాజెక్టును ఎలా రద్దు చేసిందని నిలదీశారు.
ఇదీ చూడండి : 'కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం చెప్పేదంతా అబద్ధం'