ముఖ్యమంత్రి కేసీఆర్ అనాలోచిత వైఖరితోనే రాష్ట్రంలో కరోనా ఉపద్రవం ముంచుకొచ్చిందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. జూమ్ యాప్ ద్వారా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశమయ్యింది. కోర్ కమిటీ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, శ్రీనివాస్ కృష్ణన్, మధుయాస్కీ, సంపత్‌కుమార్, ఎమ్యెల్యేలు శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, ఎమ్యెల్సీ జీవన్‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్, కుసుమకుమార్, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, వి. హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
దేశంలో చాలా రాష్ట్రాలు కరోనాకు ఉచిత వైద్యం అందిస్తుంటే... తెలంగాణలో మాత్రం లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. కరోనా నివారణకు మందులు దొరకడం లేదని, ఆక్సిజన్, బెడ్లు, వెంటిలేటర్లు అసలే దొరకడంలేదని విమర్శించారు. డబ్బులు పెట్టినా బెడ్లు లేవని, పేద, మధ్య తరగతి ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని ఉత్తమ్ ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ మెడికల్ హబ్‌గా ఉన్నా... ఇక్కడ వ్యాక్సిన్ తయారైనా రాష్ట్రంలో ప్రజలకు మాత్రం వ్యాక్సిన్ లేదని తెలిపారు. దేశంలో రెమ్‌డెసివిర్ మందు హెటిరో కంపెనీ హైదరాబాద్‌లో తయారు చేస్తున్నా...ఇక్కడ ఆ మందు దొరకడం లేదని విమర్శించారు. మౌలిక వసతలు కల్పనలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని.. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ అంశాలపై కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా పోరాటం చేస్తుందని.. ప్రతి కార్యకర్త, నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందించాలని సూచించారు. రాజీవ్‌గాంధీ 30వ వర్ధంతి సందర్బంగా ఈ నెల 21న మాస్కులు, మందులు, ఆహారాలు, పంపిణీ చేయాలని సూచించారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆర్థిక సహకారంతో గాంధీ భవన్‌లో రెండు అంబులెన్సులు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను కరోనా ఆస్పత్రులుగా మార్చి, కరోనా రోగులను ఆదుకోవాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు హనుమంతరావు సూచించారు. మాస్కులు, మందులు, ఆహార పదార్థాలు అందజేయాలని నాయకులకు ఏఐసీసీ సూచిందన్నారు.