హైదరాబాద్ గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌కు ఈ నెల 13 నుంచి పాలకవర్గం సెలవు ప్రకటించింది. అత్యంత రద్దీగా ఉండే మార్కెట్‌లో కోయంబేడు తరహా పరిస్థితులు తలెత్తకూడదని మార్కెటింగ్ శాఖ చర్యలు చేపట్టింది.
కరోనా నియంత్రణలో భాగంగా పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తోంది. రెండు వారాలపాటు నగర శివారు కొహెడలో తాత్కాలికంగా కార్యకలాపాలు నిర్వహించాలని నిర్ణయించింది.
వర్తకులు, కమీషన్ ఏజెంట్లు తరలివెళ్లాలని అధికారులు సూచించారు. గత అనుభవాల దృష్ట్యా కొహెడకు వెళ్లబోమని కమీషన్ ఏజెంట్లు, పండ్ల వ్యాపారులు తేల్చిచెప్పారు. ఏ మాత్రం వసతులు లేవని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
వేసవిలో అకాల వర్షానికి జరిగిన ప్రమాదాలను ప్రస్తావిస్తున్నారు. వాళ్లకు నచ్చచెప్పేందుకు అధికారులు ఏర్పాటు చేసిన సమావేశం అర్థాంతరంగా ముగిసింది. కొహెడలో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయాల్సిందేనంటూ కమీషన్ ఏజెంట్లు మధ్యలోనే వెళ్లిపోయారు.
అధికారులు మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ గడ్డిఅన్నారం నుంచి పండ్ల మార్కెట్ తరలించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు.
కొహెడలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి నిరంజన్‌రెడ్డి ఇచ్చిన హామీని గడ్డిఅన్నారం పాలకవర్గం ఛైర్మన్ వీరమల్ల రామనర్సింహ గౌడ్ గుర్తుచేశారు. మార్కెట్ తాత్కాలిక తరలింపు వ్యవహారంపై మరోసారి మార్కెటింగ్ శాఖ అధికారులు... కమీషన్ ఏజెంట్లతో సమావేశం జరిపి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇదీ చూడండి: 30 ఏళ్ల ముందస్తు ప్రణాళికతో రిజర్వాయర్ నిర్మించాం: కేటీఆర్