ఔషధ నియంత్రణ సంస్థలో దీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తున్న వారికి స్థానచలనం కల్పించాలని వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఇటీవల ఇచ్చిన ఆదేశాలతో కదలిక వచ్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ ఇటీవల విడుదల చేశారు. సీనియారిటీపై స్పష్టత ఇవ్వకపోవడంతో ఉద్యోగుల్లో గందరగోళం నెలకొంది. 10 మంది సహాయ సంచాలకులు, 51 మంది ఔషధ నియంత్రణాధికారుల్లో మూడేళ్లకు పైగా ఒకేచోట ఉన్నవారిని బదిలీ చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. భార్య/భర్త, 70 శాతానికి పైగా వైకల్యం, మానసిక వైకల్యమున్న పిల్లలు, క్యాన్సర్, న్యూరోసర్జరీ, కిడ్నీ, కాలేయ మార్పిడి, గుండె శస్త్రచికిత్స, ఎముక క్షయ తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు.. ఇలా ప్రాధాన్యతా క్రమంలో పరిగణనలోకి తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ అర్హతలుండి కూడా ఒకవేళ ఒక స్థానానికి ఒకరి కంటే ఎక్కువ మంది దరఖాస్తు చేసుకుంటే ‘సీనియర్ మోస్ట్ పర్సన్’ను లెక్కలోకి తీసుకోవాలని పేర్కొనడం వివాదస్పదమైంది. ఇక్కడ ‘సీనియర్ మోస్ట్ పర్సన్’ అనే దానికి నిర్వచనమివ్వలేదు. దీర్ఘకాలంగా ఒకే చోట పనిచేసిన వారా? లేదా వృత్తిలో ఎక్కువ కాలం అనుభవం ఉన్నవారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటే జీహెచ్‌ఎంసీ పరిధిలోని అధికారులకు లబ్ధి చేకూరుతుందనే విమర్శలున్నాయి.
* 2018 మే 24న బదిలీల సందర్భంగా ఇచ్చిన ఉత్తర్వుల్లో ‘లాంగ్ స్టాండింగ్’ పదానికి నిర్వచనం ఇచ్చారు. ఒకే స్థానంలో వేర్వేరు స్థాయుల్లో పదోన్నతులు పొంది కూడా అక్కడే పనిచేయడాన్ని కూడా లాంగ్ స్టాండింగ్‌గా లెక్కించాలన్నారు.
* నాటి ఆదేశాల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరిలను కలుపుకొని ఒకే స్థానంగా అంటే జీహెచ్‌ఎంసీగా పరిగణించారు. ఇతర జిల్లాలకు బదిలీ చేసేలా ఆదేశాలిచ్చారు. ఇప్పుడిచ్చిన ఉత్తర్వుల్లో ముఖ్యమైన ఈ అంశానికి కూడా చోటివ్వలేదు. దీంతో 10-12 ఏళ్లుగా జీహెచ్‌ఎంసీ పరిధిలో పాతుకుపోయిన అధికారులు జిల్లాలకు బదిలీ అయ్యే అవకాశాలే లేకుండా పోయాయని ఉద్యోగులు మండిపడుతున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి: