సింగరేణిలో త్వరలో కొలువుల జాతర మొదలు కానుంది. వివిధ విభాగాల్లో 651 ఉద్యోగాల కోసం త్వరలో నోటిఫికేషన్లు జారీ చేసి.. మార్చి నెలాఖరులోగా భర్తీ చేయనున్నట్లు సింగరేణి సీఎండీ శ్రీధర్ వెల్లడించారు. అదేవిధంగా మరో 1,436 ఉద్యోగాలను అర్హులైన అంతర్గత సిబ్బందితో భర్తీ చేసేందుకు సింగరేణి యాజమాన్యం సిద్ధమవుతోంది. ఇంటర్వ్యూ ప్రక్రియ ఉండదని.. రాతపరీక్ష, ప్రతిభ ఆధారంగా నియామకాలు ఉంటాయని.. ప్రలోభాలు నమ్మి మోసపోవద్దని సీఎండీ కోరారు.
651 ఉద్యోగాలు భర్తీ
సింగరేణిలోని వివిధ విభాగాల్లో 569 కార్మిక, 82 అధికారుల స్థాయి పోస్టులు భర్తీ చేయనున్నట్లు శ్రీధర్ తెలిపారు. కార్మికుల స్థాయిలో 177 జూనియర్ అసిస్టెంట్లు, 128 ఫిట్టర్లు, 51 ఎలక్ట్రీషియన్ ట్రైనీలు, 54 వెల్డర్ ట్రైనీలు, 22 టర్నర్, మెషినిస్టు ట్రైనీలు, 14 మోటర్ మెకానిక్ ట్రైనీలు, 19 మౌల్డర్ ట్రైనీ పోస్టులు భర్తీ చేయనున్నట్లు సింగరేణి సంస్థ తెలిపింది.
త్వరలో జూనియర్ అటవీ అధికారి పోస్టుల భర్తీ
సింగరేణి ఆస్పత్రుల్లో 84 జూనియర్ స్టాఫ్ నర్సు, 7 ల్యాబ్ టెక్నీషియన్, 5 ఫార్మాసిస్టు, ఎక్స్-రే, ఈసీజీ, వెంటిలేటర్ విభాగాల్లో రెండు చొప్పున, ఫిజియోథెరపీ, వెంటిలేటర్ విభాగంలో ఒక్కొక్క పోస్టును భర్తీ చేయనున్నట్లు సింగరేణి సీఎండీ తెలిపారు. అధికారుల స్థాయిలో మైనింగ్ విభాగంలో- 39, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్లో -10, సివిల్ ఇంజినీరింగ్లో- 7, ఐటీలో-6 ,మేనేజ్మెంట్ ట్రైనీలు- 3. జూనియర్ అటవీ అధికారి పోస్టుల భర్తీకి కూడా త్వరలో నోటిఫికేషన్ జారీ చేసేందుకు సింగరేణి యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది.
1436 అంతర్గత ఖాళీలు
వివిధ విభాగాల్లోని 1,436 ఉద్యోగ ఖాళీలను అర్హులైన అంతర్గత సిబ్బందితో నియమించేందుకు త్వరలో నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు సీఎండీ శ్రీధర్ తెలిపారు. అంతర్గత నియామకాల ద్వారా 210 ఈపీ ఆపరేటర్ ట్రైనీ, 178 ఈపీ ఆపరేటర్ ఫిట్టర్ ట్రైనీ, 177 జూనియర్ అసిస్టెంట్, 175 వార్డు అసిస్టెంట్, 64 డ్రైవర్, 55 వెల్డర్ ట్రైనీ, 56 అసిస్టెంట్ ఫోర్ మెన్, 51 ఎలక్ట్రీషియన్ ట్రైనీలు, 42 ఈపీ ఎలక్ట్రీషియన్ ట్రైనీలు, 36 పిట్ ఆఫీస్ అసిస్టెంట్, 24 జూనియర్ అకౌంటెంట్లు, 22 టర్నర్ మెషినిస్ట్ ట్రైనీలు, 19 మౌల్డర్ ట్రైనీలు, 14 మోటార్ మెకానిక్ ట్రైనీలు, 13 స్టోర్ కీపర్స్, 8 జూనియర్ ఫారెస్ట్ అసిస్టెంట్స్, 7 ల్యాబ్ టెక్నీషియన్లు, 5 ‘లా’-అసిస్టెంట్స్, 5 ఫార్మాసిస్టు పోస్టులతో పాటు, ఎక్స్‌రే, ఈసీజీ, వెంటిలేటర్ అసిస్టెంట్ పోస్టులు రెండు చొప్పున, డైటీషియన్, ఫిజియోథెరపిస్టు, డయాలసిస్ టెక్నీషియన్ ఉద్యోగాలు ఒక్కొక్కటి అంతర్గత సిబ్బందితో భర్తీ చేయనున్నట్లు సీఎండీ వెల్లడించారు.
పైరవీల్లేవ్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవం నుంచి ఇప్పటి వరకు సింగరేణిలో 13 వేల 934 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు సీఎండీ శ్రీధర్ తెలిపారు. కారుణ్య నియామకాల ద్వారా 10వేల 879, ప్రత్యక్ష నియామకాల ద్వారా 3 వేల 55 ఉద్యోగాలు , అంతర్గత సిబ్బందితో మరో 2 వేల 510 ఖాళీలను భర్తీ చేసినట్లు వెల్లడించారు. ఉద్యోగ నియామక ప్రక్రియలో పైరవీలకు ఆస్కారం లేదని.. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా ప్రలోభ పెడితే నమ్మి మోసపోవద్దని సూచించారు.
- ఇదీ చూడండి : పంచభూతాలను దోచుకుంటున్న పార్టీ తెరాస: బండి సంజయ్